Share News

ICC Decision: ‘బంగ్లా’ డిమాండ్‌కు ఐసీసీ నో

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:17 AM

బంగ్లాదేశ్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్‌ నుంచి తరలించాలనే బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ) డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అంగీకరించే అవకాశాలు లేవు. ఇదే...

ICC Decision: ‘బంగ్లా’ డిమాండ్‌కు ఐసీసీ నో

  • భారత్‌లో బంగ్లాదేశ్‌ జట్టుకు ముప్పు లేదు

  • తేల్చిన భద్రతా నిపుణులు

న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను భారత్‌ నుంచి తరలించాలనే బంగ్లా క్రికెట్‌ బోర్డు (బీసీబీ) డిమాండ్‌ను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అంగీకరించే అవకాశాలు లేవు. ఇదే విషయాన్ని ఐసీసీ సూచన ప్రాయంగా వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన భద్రతా నిపుణులతో ఐసీసీ రిస్క్‌ అంచనా విభాగం సర్వే చేయించింది. భారత్‌లో బంగ్లా మ్యాచ్‌లకు ముప్పు వాటిల్లే పరిస్థితి లేదని ఆ నిపుణులు తేల్చారు’ అని ఐసీసీ సోమవారం ప్రకటించింది. ‘మొత్తంగా టీ20 వరల్డ్‌ కప్‌నకు భారత్‌లో రిస్క్‌ తక్కువగా, పరిమితంగా ఉందని నిపుణులు తేల్చారు. ప్రపంచ స్థాయి టోర్నీల భద్రత ప్రొఫైల్‌ ఇలాగే ఉంటుంది’ అని ఐసీసీ వర్గాలు తెలిపాయి. భారత్‌లోని ఏ వేదిక వద్దా బంగ్లాదేశ్‌ అధికారులకు సైతం ఎలాంటి ముప్పు లేదని నిపుణులు నిర్ధారించినట్టు సమాచారం.


ఆ వార్తలు శుద్ధ అబద్ధం: ఐసీసీ

బంగ్లాదేశ్‌ జట్టు భద్రతకు భారత్‌లో ముప్పు ఉందని తాము అంగీకరించినట్టు వచ్చిన వార్తలను ఐసీసీ కొట్టి పారేసింది. ఈ మేరకు బీసీబీకి తమ భద్రతా విభాగం ఎలాంటి లేఖ రాయలేదని స్పష్టంజేసింది. భారత్‌లో తమ జట్టు భద్రతకు సంబంధించి వ్యక్తంజేసిన ఆందోళనను ఐసీసీ పరిగణనలోకి తీసుకున్నట్టు బంగ్లాదేశ్‌ ప్రభుత్వ క్రీడా సలహాదారు అజీఫ్‌ నజ్రుల్‌ సోమవారం ఉదయం వెల్లడించారు. అయితే ఈ వార్తలు శుద్ధ అబద్ధమని ఐసీసీ పేర్కొంది. కాగా..బంగ్లా మ్యాచ్‌లపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. కోల్‌కతా, ముంబైలో బంగ్లా జట్టు ఆడాల్సిన మ్యాచ్‌లకు ప్రత్యామ్నాయంగా చెన్నై, తిరువనంతపురం వేదికలను ఐసీసీ సూచించినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్‌ సైకియా తోసిపుచ్చాడు. ఐసీసీ నుంచి అలాంటి సమాచారమేదీ లేదన్నాడు. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్‌ వచ్చేనెల 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం.. వెస్టిండీస్‌ (ఫ్రిబవరి 7), ఇటలీ (ఫిబ్రవరి 9), ఇంగ్లండ్‌ (ఫిబ్రవరి 14)లతో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌ తలపడాల్సి ఉంది. అనంతరం ముంబై (ఫిబ్రవరి 17) వేదికగా నేపాల్‌ జట్టును బంగ్లాదేశ్‌ ఢీకొనాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఔట్.. ఆ స్థానంలో ఆడేది ఎవరంటే?

నన్ను ఆల్‌రౌండర్‌గా మార్చాలనుకుంటున్నారు.. హర్షిత్ రాణా

Updated Date - Jan 13 , 2026 | 06:17 AM