భువీని జట్టు నుంచి తప్పించడం సరైన నిర్ణయం కాదు: మహ్మద్ కైఫ్
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:33 AM
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా.. నాలుగో మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న ఓ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమిండియా.. నాలుగో మ్యాచ్‌లో మాత్రం విఫలమైంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న ఓ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల తర్వాత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు వరుసగా అవకాశాలు ఇవ్వకుండా కేవలం మూడు మ్యాచ్‌లకే పక్కన పెట్టడాన్ని తప్పుబట్టాడు. గౌతమ్ గంభీర్, శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్‌మెంట్ తొందరపాటు నిర్ణయం తీసుకుందని విమర్శించాడు.
‘నాలుగో టీ20లో భువనేశ్వర్‌ను జట్టు నుంచి తప్పించడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇరు జట్లలో కలిపి కనీసం 10-11 మంది బౌలర్లు ఉన్నారు. వారిలో దాదాపు అందరూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ పరుగులు ఇస్తున్నప్పుడు ఒక్క భువనేశ్వర్‌నే ప్రత్యేకంగా ఎందుకు తప్పించాలి? నాకు ఈ నిర్ణయం అర్థం కావడం లేదు. నాలుగేళ్ల తర్వాత అతడు భారత జట్టులోకి తిరిగొచ్చాడు. పైగా అప్పటికే సిరీస్‌ను మనమే గెలుచుకున్నాం. ఇదేమీ డూ ఆర్ డై మ్యాచ్ కాదు కదా! ఇలాంటి పరిస్థితుల్లో మార్పు చేయాల్సిన అవసరం ఏముంది? అతడికి ఐదు మ్యాచ్‌ల సిరీస్ మొత్తం అవకాశమిచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సిందే. మూడు మ్యాచ్‌లకే తప్పించడం సరైన పద్ధతి కాదు.
భువనేశ్వర్ సామర్థ్యం ఏమిటో అందరికీ తెలుసు. రెండు, మూడు మ్యాచ్‌ల్లో సరిగా బౌలింగ్ చేయకపోయినా అతడికి అండగా నిలవాలి. జట్టులో బుమ్రా కూడా లేడు. మిగతా బౌలర్లంతా కొత్తవాళ్లే. భువనేశ్వర్ నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదన్న విషయం నిజమే. ఆ విషయం అతడికి కూడా తెలుసు. కానీ పరుగులు సమర్పించుకుంటున్నది అతడు ఒక్కడే కాదు. ఐదు మ్యాచ్‌ల్లోనూ అవకాశం ఇచ్చి ఉంటే అతడి ప్రదర్శనపై స్పష్టమైన అంచనాకు వచ్చేవాళ్లం. ఇది టీమ్ మేనేజ్‌మెంట్ తొందరపాటు నిర్ణయం’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా ఆదివారం న్యూజిలాండ్‌తో ఐదో టీ20 జరగనుంది. ఇందులో భువీకి అవకాశం దక్కుతుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న రోహిత్ శర్మ.. ఎప్పుడంటే?
వైభవ్‌ను ఆడించాలనే ఉద్దేశం లేకపోతే స్వదేశానికి పంపించండి: ఆకాశ్ చోప్రా