రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేసిన మిట్టల్ ఫ్యామిలీ!
ABN , Publish Date - May 03 , 2026 | 05:58 PM
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో భారీ మార్పులు జరిగాయి. ఆ ఫ్రాంచైజీని ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలా సొంతం చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోన్న వేళ.. ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలో భారీ మార్పులు జరిగాయి. ఆ ఫ్రాంచైజీని ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, అదార్ పూనావాలా సొంతం చేసుకున్నారు. ఇంతకుముందు ఆర్ఆర్ కోసం బిడ్ వేసిన సోమాని కన్సార్టియం నిధులను సమీకరించుకోవడంలో విఫలం కావడంతో పోటీ నుంచి వైదొలిగింది. దీంతో రూ.15,600కోట్లతో మిట్టల్-పూనావాలా, మనోజ్ బదాలేతో కూడాన కన్సార్టియం బిడ్ వేసి ఆర్ఆర్ ఫ్రాంచైజీని దక్కించుకుంది. అయితే ఇందులోనే రాజస్థాన్ రాయల్స్, పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ కలిసి ఉంటాయి.
అయితే ఈ బిడ్‌లో మిట్టల్ కుటుంబానికి 75 శాతం, పూనావాలా 18 శాతం, మిగతా ఏడు శాతం మనోజ్ బదాలేతో పాటు ఇతర ఇన్వెస్టర్లకు వాటాలు ఉన్నాయి. ఈ డీల్ మూడో త్రైమాసికం నాటికి పూర్తి కానుంది. బీసీసీఐ, సీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఇతర సంస్థల ఆమోదాలతో ప్రక్రియ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మిట్టల్ ఫ్యామిలీ ఓ ప్రకటనను జారీ చేసింది. ‘మనోజ్ బదాలే, ఆయన కన్సార్టియం నుంచి అదార్ పూనావాలా భాగస్వామ్యంతో రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేయడానికి నిర్దిష్ట ఒప్పందం కుదిరినట్లు లక్ష్మీ నివాస్ మిట్టల్, ఆదిత్య మిట్టల్ వెల్లడించారు. బదాలే మద్దతు కొనసాగుతుంది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ
ధోనిలా ‘గన్‌షాట్’ సంబరాలు చేసుకోవాలని ముందే అనుకున్నా: కార్తిక్ శర్మ