నాకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి: వినేశ్ ఫొగాట్
ABN , Publish Date - May 03 , 2026 | 04:59 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండాలో నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో వినేశ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆ టోర్నీలో తనకు గానీ, తన జట్టు సభ్యులకు గానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి భారత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వినేశ్ హెచ్చరించారు
ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మరోసారి వార్తల్లో నిలిచారు. మరికొద్ది రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండాలో నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో వినేశ్ చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమయ్యయి. తన రీఎంట్రీని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారంటూ రెజ్లింగ్ సమాఖ్యపై ఇటీవలే వినేశ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గోండాలో జరగబోయే టోర్నమెంట్‌లో తనకు గానీ, తన జట్టు సభ్యులకు గానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి భారత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వినేశ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌పై వినేశ్ మరోసారి పరోక్షంగా ఆరోపణలు చేశారు.
‘నాకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు అవసరం లేదు. మైదానంలో ప్లేయర్లు పడిన కష్టానికి తగ్గ ఫలితాలు రావాలి. నా రీఎంట్రీ ఈవెంట్‌లో పక్షపాతపూరితమైన అంపైరింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టోర్నీ జరిగే గోండా ప్రాంతంపై బ్రిజ్‌భూషణ్ ప్రభావం ఉంది. ఆయన తన సన్నిహితుల ద్వారా ఈ పోటీ ఫలితాలను ప్రభావితం చేస్తారని నా అనుమానం. బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వైధింపుల కేసు నమోదు చేసిన ఆరుగురు మహిళల్లో నేను కూడా ఉన్నాను. అతడి వల్ల ఇప్పటికే మేం చాలా నష్టపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా క్రీడాకారులు పోటీలో పాల్గొనడం ఎంత కష్టమో చెబితే అర్థం కాదు. దేశం నుంచి వచ్చే ఒత్తిడి ఒకవైపు ఉంటే.. ఇలాంటి వాతారణం వల్ల మానసికంగా మరింత భారం పడుతుంది. టోర్నమెంట్‌లో పారదర్శకతను నిర్ధారించడానికి మీడియా, క్రీడా వర్గాలు వేదిక వద్ద ఉండాలని కోరుకుంటున్నాను’ అని వినేశ్ వెల్లడించారు.
గోండాలో జరగనున్న టోర్నమెంట్‌లో వినేశ్ 57 కేజీల విభాగంలో పోటీ పడనున్నారు. 2026 ఆసియా క్రీడల్లో భారత్ తరఫున పోటీ చేయడానికి రెజ్లర్ల ఎంపికకు భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్వహించే ఈ టోర్నీ కీలకం కానుంది. ఇదిలా ఉండగా, పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత దాదాపు 18 నెలలు విరామం తీసుకున్న వినేశ్.. ఆసియా గోల్డ్ లక్ష్యంగా సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ ‘అన్‌ప్రొఫెషనల్’ అంటూ వ్యాఖ్య.. విమర్శలపై స్పందించిన జితేశ్ శర్మ
ధోనిలా ‘గన్‌షాట్’ సంబరాలు చేసుకోవాలని ముందే అనుకున్నా: కార్తిక్ శర్మ