Share News

రాజకీయ కారణాల వల్లే బాబర్‌ను ఆడిస్తున్నారు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:57 PM

సూపర్ 8లో ఇంగ్లండ్‌పై కీలక పోరులో కూడా పాక్ సీనియర్ ప్లేయర్ బాబర్ ఆజం మరోసారి నిరాశపర్చాడు. 24 బంతులు ఎదుర్కొని కేవలం 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. బాబర్ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రాజకీయ కారణాల వల్లే బాబర్‌ను ఆడిస్తున్నారు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
Michael Vaughan

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో మంగళవారం ఇంగ్లండ్‌పై పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. సూపర్ 8లో న్యూజిలాండ్‌తో పాక్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇంగ్లండ్‌పై కూడా ఓడటంతో పాక్ సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. సూపర్ 8లో ఇంగ్లండ్‌పై కీలక పోరులో కూడా పాక్ సీనియర్ ప్లేయర్ బాబర్ ఆజం మరోసారి నిరాశపర్చాడు. 24 బంతులు ఎదుర్కొని కేవలం 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.. బాబర్ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.


‘బాబర్ ఆజం విషయంలో రాజకీయ జోక్యం ఉందని నా అనుమానం. రాజకీయ కారణాలే వల్లే అతడిని జట్టులో ఆడిస్తున్నారు. అయితే పాకిస్థాన్‌లో విదేశీ కోచ్‌గా పని చేయడం చాలా కష్టం. కానీ ఈ విషయంలో పాక్ కోచ్ మైక్ హెస్సేన్ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ కారణాల వల్ల బాబర్‌ను తప్పించడానికి వీల్లేదు. కాబట్టి అతడిని ఇన్సూరెన్స్ పాలసీలాగా నాలుగో స్థానంలో ఉపయోగిస్తున్నారు. రెండు వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చి జట్టును గెలుపిస్తాడనే నమ్మకం ఉంచి ఆడిస్తున్నారు. కానీ ఈ వ్యూహం ప్రపంచ కప్ గెలిచేందుకు మాత్రం ఉపయోగపడదు. జట్టు పరిస్థితులకు అనుగుణంగా బాబర్ ఆటతీరు ప్రదర్శించాలి. అప్పుడే పాక్ సెమీస్‌కు చేరుతుంది’ అని వాన్ వెల్లడించాడు.


కాగా గత టీ20 ప్రపంచ కప్‌లో బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ కేవలం 101 మాత్రమే. ఈ సారి కూడా 112 స్ట్రైక్ రేట్, 22.75 సగటుతోనే బ్యాటింగ్ చేస్తున్నాడు. బాబర్ ఫామ్ లేమి జట్టుకు తీవ్ర నష్టం చేకూరుస్తుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాక్ తన చివరి సూపర్ 8 మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

బట్లర్.. పవర్ హౌస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్: హ్యారీ బ్రూక్

టీమిండియా మరో మ్యాచ్ ఓడితే తిప్పలు తప్పవు: రవి శాస్త్రి

Updated Date - Feb 25 , 2026 | 03:57 PM