ఫిఫా ప్రపంచకప్: నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో
ABN , Publish Date - Jun 19 , 2026 | 09:58 AM
ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య మెక్సికో జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో మెక్సికో 1–0 తేడాతో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య మెక్సికో జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో మెక్సికో 1–0 తేడాతో దక్షిణ కొరియాపై ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ప్రస్తుత ప్రపంచకప్2026లో అధికారికంగా నాకౌట్ చేరిన మొదటి జట్టుగా మెక్సికో అవతరించింది. గత 2022 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన మెక్సికో.. ఈసారి సొంత గడ్డపై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి అభిమానులను సంబరాల్లో ముంచెత్తింది.
మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగినప్పటికీ.. కొరియా డిఫెండర్లు చేసిన చిన్నపాటి తప్పిదాలు మెక్సికోకు వరంగా మారాయి. మ్యాచ్ 50వ నిమిషంలో దక్షిణ కొరియా గోల్‌కీపర్ కిమ్ సీయుంగ్ గ్యు, డిఫెండర్ లీ గి హ్యుక్ ఒకరినొకరు ఢీకొట్టడంతో బంతి చేజారింది. అక్కడే సిద్ధంగా ఉన్న మెక్సికో ప్లేయర్ లూయిస్ రోమో.. లూజ్ బాల్‌ను సులువుగా గోల్ పోస్ట్‌లోకి పంపి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
మ్యాచ్ ముగిసే సమయానికి (87వ నిమిషంలో) కొరియా స్టార్ చో గ్వే సంగ్ కొట్టిన హెడర్‌ను, ఆపై వచ్చిన రీబౌండ్‌ను మెక్సికో గోల్‌కీపర్ రాహుల్ రంగెల్ అద్భుతమైన డైవ్‌తో అడ్డుకుని జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. గ్రూప్-ఎ లో ఆరు పాయింట్లతో మెక్సికో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే గ్రూప్‌లో జరిగిన చెక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికాల మ్యాచ్1-1తో డ్రా ముగిసింది. మరో మ్యాచ్‌లో ఆతిథ్య కెనడా బోణీ కొట్టింది. గ్రూప్-బిలో ఉన్న కెనడా 6-0తో ఖతార్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి:
ఖతార్, కెనడా ఆటగాళ్ల మధ్య ఘర్షణ
టీ20 ప్రపంచ కప్2026: దూసుకెళ్తున్న వెస్టిండీస్