Share News

ఖతార్, కెనడా ఆటగాళ్ల మధ్య ఘర్షణ

ABN , Publish Date - Jun 19 , 2026 | 08:56 AM

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌2026లో ఆతిథ్య కెన‌డా బోణీ కొట్టింది. గ్రూప్‌-బిలో ఉన్న కెన‌డా 6-0తో ఖ‌తార్‌పై భారీ విజయాన్ని న‌మోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

 ఖతార్, కెనడా ఆటగాళ్ల మధ్య ఘర్షణ
Canada vs Qatar

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లో ఆతిథ్య కెనడా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. వాంకోవర్‌లోని బిసి ప్లేస్ స్టేడియంలో జరిగిన ఏకపక్ష పోరులో కెనడా 6-0 తేడాతో ఖతార్‌పై ఘన విజయం సాధించింది. పురుషుల ప్రపంచకప్ చరిత్రలోనే కెనడాకు ఇది మొట్టమొదటి విజయం కావడం విశేషం. స్టార్ ఫార్వర్డ్ జోనాథన్ డేవిడ్ (29, 45+3, 90+2 నిమిషాల్లో) అద్భుతమైన హ్యాట్రిక్ గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. సైల్ లారిన్ (16వ నిమిషం), నాథన్ సాలిబా (64వ నిమిషం) చెరో గోల్ సాధించారు. ఖతార్ ఆటగాడు మొహమ్మద్ మనాయ్ 75వ నిమిషంలో సెల్ఫ్ గోల్ చేయడంతో.. అది కెనడా ఖాతాలోకి చేరి.. ఆ జట్టు ఆధిక్యం మరింత పెరిగింది.


అయితే ఖతార్ , కెనడా మ్యాచ్‌లో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఖతార్ ఆటగాళ్ల కఠినమైన ట్యాక్లింగ్‌ల వల్ల మ్యాచ్ ఆఖర్లో ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు నెట్టుకుంటూ తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. చివరకు ఇరు జట్ల ప్రధాన కోచ్‌లు జెస్సీ మార్ష్, జులెన్ లోపెటెగి మధ్య కూడా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధమైన ఆటన కారణంగా ఖతార్ జట్టు ఇద్దరు ఆటగాళ్లను రెడ్ కార్డ్స్ రూపంలో కోల్పోయి 9 మందికే పరిమితమైంది. మొదటి భాగంలో హొమామ్ అహ్మద్‌కు రిఫరీ రెడ్ కార్డ్ చూపాడు. దీంతో అతడు చేసిన గోల్స్ కూడా చెల్లకుండాపోయాయి.


అలానే రెండో అర్ధ భాగంలో ఖతార్ మిడ్‌ఫీల్డర్ అసిమ్ మదిబో చేసిన ప్రమాదకరమైన ఫౌల్ వల్ల కెనడా స్టార్ ఇస్మాయిల్ కోనే ఎడమ కాలు విరిగి మైదానంలోనే కుప్పకూలాడు. తీవ్ర నొప్పితో బాధపడిన అతడిని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. ఆటకు విరుద్ధమైన ట్యాక్లింగ్‌కు మదిబోకు సైతం రెడ్ కార్డ్ లభించింది. ఈ అద్భుత విజయంతో కెనడా నాకౌట్ దశకు చేరువకాగా, కోనే గాయం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మ్యాచ్‌కు కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఫిఫా అధ్యక్షుడు జియాని ఇన్ఫాంటినో హాజరై జట్టును ఉత్సాహపరిచారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్2026: దూసుకెళ్తున్న వెస్టిండీస్

నాడు యాసిడ్‌ దాడి బాధితుడు నేడు ‘కాంగో’ హీరో

Updated Date - Jun 19 , 2026 | 09:09 AM