Share News

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలకు అడ్డాగా టెలిగ్రాం

ABN , Publish Date - Jun 19 , 2026 | 02:55 AM

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అసాంఘిక కార్యకలాపాల కోసం టెలిగ్రాం యాప్‌ను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని ...

ఉగ్రవాదం, సైబర్‌ నేరాలకు అడ్డాగా టెలిగ్రాం

  • చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాల కోసం ప్రైవసీ ఫీచర్లను దుర్వినియోగం చేస్తున్నారు

  • వారిని పట్టుకోవడం అధికార యంత్రాంగానికీ కష్టమే

  • అందుకే నీట్‌ పరీక్షల నేపథ్యంలో తాత్కాలిక నిషేధం

  • ఢిల్లీ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌.. తీర్పు రిజర్వు

న్యూఢిల్లీ, జూన్‌ 18: ఉగ్రవాదం, సైబర్‌ నేరాలు, ఆర్థిక నేరాలు, ప్రశ్నపత్రాల లీకేజీ వంటి అసాంఘిక కార్యకలాపాల కోసం టెలిగ్రాం యాప్‌ను పలువురు దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆదివారం నీట్‌ పరీక్ష నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రం టెలిగ్రాంపై తాత్కాలిక నిషేధాన్ని విధించటం, దానిని వ్యతిరేకిస్తూ ఆ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయటం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ తేజస్‌ కారియా కేంద్రానికి నోటీసులు పంపించటంతో.. కేంద్రఎలక్ట్రానిక్స్, సమాచార మంత్రిత్వశాఖ తరఫున ఆ శాఖలో పని చేస్తున్న మయాంక్‌ అనే శాస్త్రవేత్త గురువారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. టెలిగ్రాం యాప్‌ పలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోందని ఈ అఫిడవిట్‌లో వెల్లడించారు. నకిలీ అకౌంట్లు ఉపయోగించి ఆర్థిక మోసాలకు పాల్పడే సైబర్‌ క్రిమినల్స్‌, గుర్తింపును దాచి పెట్టి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిపే ముఠాలు, వ్యక్తులు, కంప్యూటర్లలో డేటాను దొంగిలించి మోసాలకు పాల్పడేవాళ్లు, మాల్‌వేర్‌ను పంపిణీ చేసేవాళ్లు టెలిగ్రాంను ఉపయోగించుకుంటున్నట్లుగా ‘ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ కమిటీ’ (ఐ4సీ) నివేదిక తెలియజేసిందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తీవ్రవాదం, ఉగ్రవాదం, పిల్లలపై వేధింపులకు కూడా ఈ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారని, యాప్‌లో ఉండే ప్రైవసీ కారణంగానే ఈ దుర్వినియోగం జరుగుతోందని తెలిపారు. ‘టెలిగ్రాం ఒక కొత్త డార్క్‌ వెబ్‌గా మారింది. దాంట్లో జరిగే కార్యకలాపాలను గుర్తించి, మూలాలను పట్టుకోవటం అధికారయంత్రాంగానికి కూడా కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో క్రిమినల్స్‌ దీనిని పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. ఒక టెలిగ్రాం చానల్‌లో ఎంతమంది సబ్‌స్రైబర్లు అయినా ఒకరికొకరు తెలియకుండా ఉండవచ్చు.


పరిమితి లేదు. చానల్‌ క్రియేటర్‌ లేదా అడ్మిన్‌లు మాత్రమే మెసేజీలు పంపించటానికి వీలవుతుంది. టెలిగ్రాం మీద ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సైబర్‌ క్రైం రిపోర్టింగ్‌ పోర్టల్‌ ప్రకారం కేవలం 2025లోనే టెలిగ్రాం ద్వారా రూ.3,086 కోట్ల మేర ఆర్థిక మోసాలు జరిగినట్లుగా 2.75 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి’ అని అఫిడవిట్‌లో వివరంగా పేర్కొన్నారు. చైనా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, రష్యా, జర్మనీ, బ్రెజిల్‌ దేశాల్లో స్థానిక చట్టాలను, నిబంధనలను పాటించటం లేదన్న కారణంతో టెలిగ్రాం మీద చర్యలు తీసుకున్న దృష్టాంతాలున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ‘ఐటీ చట్టం, ఐటీ నిబంధనలు, 2021’ ప్రకారం ఏదైనా చట్టవ్యతిరేక అంశాన్ని తొలగించమని ఆదేశించగలమేగానీ.. మొత్తం ప్లాట్‌ఫాంనే అడ్డుకోవటం సరైనది కాదని కేంద్రం ఈ అఫిడవిట్‌లో అభిప్రాయపడింది. టెలిగ్రాం కూడా తమ నోటీసులకు స్పందిస్తోందని.. నీట్‌ పేపర్‌ లీకేజీకి సంబంధించిన పలు చానళ్లను తొలగించిందని పేర్కొంది. కాగా, టెలిగ్రాం తరఫున సీనియర్‌ న్యాయవాది ధ్రువ్‌ మెహతా, కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు.

Updated Date - Jun 19 , 2026 | 02:55 AM