Share News

లోపాలను సరిదిద్దుకుని ప్రతి మ్యాచ్ పోరాడి గెలవాల్సిందే: మెస్సి

ABN , Publish Date - Jul 05 , 2026 | 04:19 PM

ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32లో పసికూన కాబో వెర్డ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అర్జెంటీనా ఆటతీరుపై కెప్టెన్ లియోనెల్ మెస్సి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

లోపాలను సరిదిద్దుకుని ప్రతి మ్యాచ్ పోరాడి గెలవాల్సిందే: మెస్సి
Lionel Messi

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ 32లో పసికూన కాబో వెర్డ్‌పై డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా పోరాడి గెలిచిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో కాబో వెర్డ్ 2-3 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా అర్జెంటీనా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించింది. అయితే అర్జెంటీనా ఆటతీరుపై కెప్టెన్ లియోనెల్ మెస్సి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులో చాలా లోపాలు ఉన్నాయని వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.


‘తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అయితేనే సరిపోదు. కాబో వెర్డ్‌పై మేము చాలా తప్పిదాలు చేశాం. వాటిని తప్పకుండా సరిదిద్దుకోవాలి. ప్రిక్వార్టర్స్‌లో ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. కాబో వెర్డ్‌తో మ్యాచ్ కఠినంగా ఉంటుందని ముందే అంచనా వేశాం. స్పెయిన్, ఉరుగ్వేలకు గట్టిపోటీనిచ్చి.. ఆ జట్టు ఇంతదూరం వచ్చింది. తొలి గోల్ చేసిన తర్వాత ఆట మా ఆధీనంలోకి వస్తుందని ఆశించాం. కానీ అందుకు విరుద్ధంగా బంతిపై నియంత్రణ కోల్పోయాం. ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తీసుకురాలేకపోయాం. ఆ అవకాశాన్ని కాబో వెర్డ్ చక్కగా సద్వినియోగం చేసుకుంది. ప్రపంచ కప్ లాంటి టోర్నీలో నాకౌట్ మ్యాచ్ ఆడుతున్న జట్లు.. ఏదీ అంత సులువుగా వదిలేయడానికి ఇష్టపడవు. ప్రతి మ్యాచ్ ఎవరైనా పోరాడి గెలవాల్సిందే’ అని మెస్సి వెల్లడించాడు. కాగా ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనా జులై 7న అట్లాంటా వేదికగా ఈజిప్టుతో తలపడనుంది.


ఇవి కూడా చదవండి:

మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు

సచిన్ నుంచి వైభవ్ వరకు.. 37 ఏళ్లలో ఎంత మార్పు!

Updated Date - Jul 05 , 2026 | 04:19 PM