Share News

రోహిత్ శర్మ విషయంలో ఇప్పటికీ బాధేస్తుంది: క్రిస్ శ్రీకాంత్

ABN , Publish Date - Apr 22 , 2026 | 06:57 PM

దాదాపు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడిన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ పట్టరాని ఆనందం కలుగుతోంది. అయితే ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం తన కెరీర్‌లోనే పెద్ద నిరాశగా నిలిచిపోయింది.

రోహిత్ శర్మ విషయంలో ఇప్పటికీ బాధేస్తుంది: క్రిస్ శ్రీకాంత్
Rohit Sharma

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు 28 ఏళ్ల నిరీక్షణ తర్వాత మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో టీమిండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ను సగర్వంగా ముద్దాడిన క్షణాలను తలుచుకుంటే ఇప్పటికీ పట్టరాని ఆనందం కలుగుతోంది. అయితే ఆ జట్టులో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు చోటు దక్కకపోవడం తన కెరీర్‌లోనే పెద్ద నిరాశగా నిలిచిపోయింది. అప్పుడు మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను.. సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. ఆ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఈ విషయంపై నాటి సెలక్టర్లలో ఒకరు, టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశాడు.


‘ఆ విషయం తలుచుకుంటే నాకు ఇప్పటికీ బాధగా ఉంటుంది. గతేడాది రోహిత్‌ను కలిసినప్పుడు ‘సారీ బాస్’ అని చెప్పాను. ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం కాదది. ఆ సమయంలో మా ఆలోచనా విధానం మొత్తం ఆల్‌రౌండర్లను తీసుకోవడం పైనే ఉంది. ధోనీ నాయకత్వంలో భారత జట్టు సమతూకాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయాల్సి వచ్చింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా కొంత సహకారం అందించే ఆటగాళ్లను ఎంపిక చేయడమే మా కమిటీ ప్రధాన లక్ష్యం. ఆ ఆలోచనా ధోరణినే 1983 ప్రపంచ కప్ విజయానికి దోహదపడింది. అందుకే ఆ దిశగానే అడుగులు వేశాం’ అని క్రిస్ వివరించాడు.


అర్హుడే కానీ..

‘2011 ప్రపంచ కప్ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ యువరాజ్ సింగ్‌కి దక్కింది. అతడు బ్యాట్‌తో పాటు బంతితోనూ అద్భుతంగా రాణించాడు. సెహ్వాగ్, సచిన్, రైనా, యూసఫ్ పఠాన్.. అందరూ బౌలింగ్ చేశారు. అశ్విన్‌ను బ్యాకప్‌గా ఉంచాం. రోహిత్ శఱ్మ అర్హుడే కానీ ఆ వ్యూహం కారణంగానే దురదృష్టవశాత్తు చోటు దక్కలేదు’ అని క్రిస్ విచారం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా.. 2011 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా 28 ఏళ్ల తర్వాత ముద్దాడింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టైటిల్‌ను అందుకుంది. ఆ తరువాతి కాలంలో రోహిత్ శర్మ టీమిండియాకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. టీ20 వరల్డ్‌ కప్ (2007, 2024), ఛాంపియన్స్ ట్రోఫీ (2013, 2025) గెలిచిన జట్లలో భాగమయ్యాడు. అయితే ఇప్పటికీ వన్డే వరల్డ్‌ కప్ విజేత జట్టులో సభ్యుడిగా నిలవలేకపోవడం రోహిత్‌కు మిగిలిన లోటుగా చెప్పుకోవచ్చు. 2023లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన వరల్డ్‌ కప్‌లో కెప్టెన్‌గా భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లినా, ఆస్ట్రేలియాతో తుది పోరులో ఓటమి పాలవడంతో మరోసారి ఆ కల నెరవేరలేదు. ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన రో.. 2027 వన్డే ప్రపంచ కప్ కోసం శ్రమిస్తున్నాడు.


ఇవి కూడా చదవండి:

డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. పాక్ క్రికెటర్‌ కాంట్రాక్ట్ రద్దు చేసిన పీసీబీ

భారత లీగ్‌లో ఆడినందుకు ఆసీస్ మాజీ ప్లేయర్‌పై వేటు

Updated Date - Apr 22 , 2026 | 07:09 PM