ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం
ABN , Publish Date - Nov 16 , 2026 | 10:56 AM
ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి జై షా ఏకగ్రీవంగా పునర్నియామకమయ్యారు. బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి జై షా ఏకగ్రీవంగా పునర్నియామకమయ్యారు. బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జై షా పేరును ఐసీసీ డైరెక్టర్లు ప్రతిపాదించగా.. ఆయన నాయకత్వంపై బోర్డు మరోసారి విశ్వాసం ప్రకటించింది. 2024 ఆగస్టు 27న తొలిసారి ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా.. 36 ఏళ్ల వయసులోనే ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. తాజాగా రెండోసారి కూడా ఆయనకే అవకాశం దక్కింది.
జై షా రెండోసారి బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత విస్తరించడం, అంతర్జాతీయ టోర్నీలను బలోపేతం చేయడం, అసోసియేట్ దేశాలకు మరిన్ని అవకాశాలు కల్పించడం ఐసీసీ ముందున్న ప్రధాన లక్ష్యాలు. మహిళల క్రికెట్ అభివృద్ధి, అసోసియేట్ దేశాలకు ప్రోత్సాహం, అంతర్జాతీయ క్రికెట్‌లో పారదర్శకత, వాణిజ్యపరమైన అవకాశాల విస్తరణపై కూడా ఐసీసీ దృష్టి సారించనుంది.
కృతజ్ఞతలు తెలిపిన జై షా..
తన పునర్నియామకంపై జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఐసీసీ బోర్డు తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ ఒలింపిక్స్‌లోకి తిరిగి రావడం ద్వారా కొత్త ప్రేక్షకులకు ఈ ఆటను పరిచయం చేసే గొప్ప అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రయోజనాల కోసం సభ్య దేశాలతో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు. అభిమానులు, ఆటగాళ్లు, వాణిజ్య భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
భారత యువ జట్టు అద్భుతంగానే ఆడింది.. కానీ: షోయబ్ అక్తర్
భారత బ్యాటర్లు ఆటతీరును మెరుగుపరుచుకోవాలి: రవి శాస్త్రి