Share News

'రంజీ' విజేతగా జమ్ము కశ్మీర్.. స్ఫూర్తిదాయక విజయంతో నయా చరిత్ర

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:22 PM

భారతదేశ క్రికెట్లో సంచలనం. 67 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ ప్రయాణంలో జమ్ము కశ్మీర్ తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. సగర్వంగా రంజీ ట్రోఫీని ముద్దాడింది. శనివారం ఫైనల్లో కర్ణాటకపై విజయంతో జమ్ముకశ్మీర్ కొత్త చరిత్ర లిఖించింది. దేశవాళీ క్రికెట్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది.

'రంజీ' విజేతగా జమ్ము కశ్మీర్.. స్ఫూర్తిదాయక విజయంతో నయా చరిత్ర
Jammu Kashmir Wins Ranji Trophy

స్పోర్ట్స్ డెస్క్: జమ్ముకశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 67 ఏళ్ల సుదర్ఘీ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జమ్ముకశ్మీర్ జయకేతనం ఎగురవేస్తూ.. నయా ఛాంపియన్ గా అవతరించింది. దీంతో దేశవాళీ క్రికెట్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది జమ్ముకశ్మీర్ టీమ్. 1959-60 సీజన్లో తొలిసారిగా జమ్ముకశ్మీర్ రంజీ ట్రోఫీలో ఆడింది. అప్పటి నుంచి టైటిల్ వేట కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు 67 ఏళ్ల తర్వాత ఆ టీమ్ కల నెరవేరినట్టైంది. ఇవాళ ఫైనల్లో కర్ణాటకపై విజయంతో తొలిసారి రంజీ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


దేశవాళీ ప్రతిష్ఠాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2026 ఫైనల్లో జమ్ముకశ్మీర్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. ఆద్యంతం నిలకడైన ఆటతీరుతో మేటి జట్లను ఓడిస్తూ.. అసాధారణ విజయాలతో తుదిపోరుకు దూసుకెళ్లింది. ఫైనల్లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 సార్లు రంజీ ట్రోఫీ ఛాంపియన్ అయిన కర్ణాటకను జమ్ముకశ్మీర్ ఓడించింది. పారస్ డోగ్రా కెప్టెన్సీలోని జమ్ముకశ్మీర్ తుదిపోరులో అసలైన ఛాంపియన్ లా ఆడింది. మ్యాచ్ డ్రాగా ముగిసినా.. కర్ణాటకపై ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో జమ్ముకశ్మీర్ విజేతగా నిలిచింది.


మ్యాచ్ జరిగిందిలా..

హుబ్బళి వేదికగా జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్ముకశ్మీర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 584 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభమ్ పుందిర్ 121 రన్స్ తో అదరగొట్టాడు. యావర్ హాసన్ 88, సాహిల్ లోత్రా 72, కెప్టెన్ పారస్ 70, కన్హయ్య వాధవాన్‌ 70 కీలక ఇన్నింగ్స్ ఆడారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కర్ణాటక ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేవలం 293 పరుగులకే ఆలౌటైంది. ఆ టీమ్ లో మయాంక్ అగర్వాల్ 160 పరుగులతో పోరాడాడు. కేఎల్ రాహుల్ 13, దేవ్ దత్ పడిక్కల్ 11, కరుణ్ నాయర్ 0 దారుణంగా విఫలమయ్యారు. జమ్ముకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబి 5 వికెట్లతో కర్ణాటక పనిపట్టాడు. సునీల్ కుమార్, యుధ్ వీర్ చెరో 2 వికెట్లతో సత్తాచాటారు.

291 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన జమ్ముకశ్మీర్ 342/4 వద్ద డిక్లేర్ చేసి.. కర్ణాటక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బావ్ 160* సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సాహిల్ లోత్రా 101 రన్స్ తో అదరగొట్టాడు. 5వ రోజు కర్ణాటక బ్యాటింగ్ చేసినా ఇంత టార్గెట్ ఛేజ్ చేసే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా జమ్ముకశ్మీర్ గెలుపొందింది.


ఈ విజయం పట్ల జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ అధికారి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. 'మన జట్టు ఎంతో కష్టపడింది. ఈ విజయాన్ని సాధించడం మా సాధికారతను, ధైర్యాన్ని చాటి చెబుతోంది. ఈ ఘనత ప్రతి జమ్ముకశ్మీర్ క్రికెట్ అభిమానికి గర్వకారణం' అని అన్నారు. కొత్త ఛాంపియన్ గా నిలిచిన జమ్ముకశ్మీర్ జట్టుకు పలువురు సీనియర్ క్రికెటర్లు అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని 'ప్రతిభ, పట్టుదల, అంకితభావం'గా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొనియాడారు.


క్రికెట్‌లో కొత్త దిశ

జమ్ముకశ్మీర్ జట్టు.. ఈ విజయం ద్వారా క్రికెట్ ప్రపంచంలో మార్గదర్శకంగా నిలిచింది. క్రికెట్ నే కెరీర్ గా ఎంచుకునే  ఎందరో యువ ఆటగాళ్లకు ప్రేరణనిచ్చింది. గతంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్న ఈ జట్టు.. ఇప్పుడు సిసలైన ఆటతో కొత్త కోణాన్ని సృష్టించింది. కొన్ని దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, ఆర్థిక అడ్డంకుల వంటి అనేక సమస్యలతో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న ఆ జట్టు.. ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలో ఓ కొత్త కోణాన్ని చూపించింది. ఇక.. రంజీ ట్రోఫీకి సంబంధించి ఆ టీమ్ మొదటిసారి ఫైనల్‌కు చేరుకోవడం, విజేతగా నిలవడం అనేది జమ్ముకశ్మీర్ క్రికెట్ లో కొత్త వెలుగును చూపిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ జట్టు ఆటగాళ్ల స్ఫూర్తివంతమైన ప్రదర్శన, సహకారం వంటివి భారత క్రికెట్లో మంచి గుర్తింపు సంపాదించడంలో కీలకపాత్ర పోషించాయి.


ఇవీ చదవండి:

టీ20 డబ్ల్యూసీ: ఇలా జరిగితే.. మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్..

పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్ ఇదే

Updated Date - Feb 28 , 2026 | 05:16 PM