Share News

ఐపీఎల్‌లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్టార్ ప్లేయర్

ABN , Publish Date - Oct 14 , 2026 | 08:15 PM

ఐపీఎల్ 2027కి ముందు ఓ క్రేజీ ట్రేడ్ డీల్ చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీల మధ్య ఈ ట్రేడ్ జరిగింది. భారత స్టార్ పేసర్ టి.నటరాజన్ డీసీ నుంచి తిరిగి ఎస్ఆర్‌హెచ్ గూటికి చేరాడు.

ఐపీఎల్‌లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్టార్ ప్లేయర్
T Natarajan

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027కి ముందు ఓ క్రేజీ ట్రేడ్ డీల్ చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీల మధ్య ఈ ట్రేడ్ జరిగింది. భారత స్టార్ పేసర్ టి.నటరాజన్ డీసీ నుంచి తిరిగి ఎస్ఆర్‌హెచ్ గూటికి చేరాడు. మరోవైపు హైదరాబాద్ నుంచి జిషాన్ అన్సారీ ఢిల్లీ జట్టుకి వెళ్లాడు. అయితే ఈ మార్పులో భాగంగా నటరాజన్‌ ఫీజు రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గడం గమనార్హం. అన్సారీ మాత్రం తన ప్రస్తుత ఫీజు రూ.40 లక్షలకే ఢిల్లీ జట్టులో చేరనున్నాడు.


నటరాజన్‌ 2020 నుంచి 2024 వరకు ఐదు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తూ జట్టులో కీలక బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో ఒత్తిడిని తట్టుకుని బౌలింగ్‌ చేయడంలో తనదైన ముద్ర వేశాడు. గత సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ రిలీజ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ నటరాజన్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, తాజా ట్రేడ్‌లో భాగంగా రూ.5 కోట్ల సవరించిన ఫీజుతో అతడు సన్‌రైజర్స్‌లోకి తిరిగి చేరనున్నాడు.


ఢిల్లీకి స్పిన్‌ బలం..

మరోవైపు, 26 ఏళ్ల జీషన్‌ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టులో చేరనున్నాడు. ఐపీఎల్‌ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్‌ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన అతడు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీ జట్టు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు ట్రేడ్‌ చేసిన నేపథ్యంలో అన్సారీ రాక ప్రాధాన్యం సంతరించుకుంది. కుల్దీప్‌ స్థానంలో మరో స్పిన్‌ బౌలింగ్‌ ఎంపికను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ మార్పు ఉపయోగపడనుంది. కేవలం రూ.40 లక్షల ఫీజుతో అన్సారీని జట్టులోకి తీసుకోవడం ఢిల్లీకి తక్కువ ఖర్చుతో స్పిన్‌ విభాగాన్ని బలోపేతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.


ఇవి కూడా చదవండి:

భారీ స్కోర్లు చేయకపోయినా.. అతడు జట్టుకు అవసరం: పుజారా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: కెరీర్‌లోనే బెస్ట్.. నాలుగో స్థానానికి దూసుకొచ్చిన శ్రేయస్

Updated Date - Oct 14 , 2026 | 08:15 PM