Gautam Gambhir: భారత్ ఓటమి.. హెడ్ కోచ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:11 AM
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది. సొంతగడ్డపై చెలరేగాల్సిన భారత జట్టు.. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస ఓటములను చవిచూస్తోందంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై తేలిపోతున్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి షాకిచ్చిన న్యూజిలాండ్.. ఈసారి వన్డే సిరీస్‌లో దెబ్బకొట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను లిఖించింది. దీంతో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది. సొంతగడ్డపై చెలరేగాల్సిన భారత జట్టు.. గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుస ఓటములను చవిచూస్తోందంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మీమ్స్‌తో గంభీర్(Gautam Gambhir)ను ట్రోల్ చేస్తున్నారు.
వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓటమి తర్వాత న్యూజిలాండ్ జట్టు బలంగా పుంజుకుంది. క్రమశిక్షణతో కూడిన ఆటతీరుతో కివీస్ వన్డే సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. భారత జట్టు మాత్రం ప్రణాళిక లోపాలు, గందరగోళ వ్యూహాలతో ఘోరంగా తడబడింది. బ్యాటింగ్‌లో అస్థిరత్వం.. బౌలింగ్‌లో ప్రభావం చూపకపోవడం వంటివి జట్టును దెబ్బతీశాయి. బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. మన బౌలర్లు పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోవడం కివీస్ బ్యాటర్లకు బాగా కలిసొచ్చింది. కోచ్ గంభీర్ అస్పష్టమైన వ్యూహాలు భారత ఓటమికి దారితీశాయనడంలో సందేహం లేదు. ఆటగాడిగా దూకుడును ప్రదర్శించిన గంభీర్.. కోచ్‌గా అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఫామ్‌లో లేని జడేజాను పదే పదే ఆడిస్తుండటం.. అక్షర్ పటేల్ వంటి యువ ఆటగాళ్లను పక్కన పెట్టడం గంభీర్ వ్యూహాత్మక తప్పిదాలలో ఒకటి. తాను బాధ్యతలు చేపట్టాక సొంతగడ్డపై కివీస్, దక్షిణాఫ్రికాలకు టెస్టు సిరీస్‌లు కోల్పోయిన నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న గంభీర్.. ఇప్పుడు వన్డే సిరీస్ పరాభవంతో మరింత ఒత్తిడిని ఎదుర్కోనున్నాడు.
వరుస ఓటములు..
గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ఎన్నో పరాజయాలు ఎదురయ్యాయి. గతేడాది స్వదేశంలో కివీస్ జట్టు భారత్‌ను 3–0తో వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా చేతిలో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమి.. ఇప్పుడు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ పరాజయం.. ఇలా గంభీర్ బాధ్యతలు చేపట్టిన 15 నెలల్లో టీమిండియా వరుస ఓటములను మూటగట్టుకుంది.
ఇవి కూడా చదవండి..
మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్
అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318