Share News

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ

ABN , Publish Date - Feb 17 , 2026 | 02:44 PM

పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కొంత కాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. ఆయన కుడి కన్ను 85 శాతం చూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడికి మెరుగైన చికిత్స అందించాలంటూ భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్.. పాక్ ప్రభుత్వాన్ని కోరారు.

ఇమ్రాన్ ఖాన్‌కు అనారోగ్యం.. పాక్ ప్రభుత్వానికి కపిల్ దేవ్, సునీల్ గావస్కర్ లేఖ
Imran Khan

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కొంత కాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కుడికన్ను చూపు 85 శాతం కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందంటూ అతడి కుటుంబ సభ్యులు కూడా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు అంతర్జాతీయంగా మద్దతు దక్కుతోంది. అతడికి మెరుగైన చికిత్స అందించాలంటూ భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్.. పాక్ ప్రభుత్వాన్ని కోరారు.


ఈ నేపథ్యంలో 14 మంది సంతకాలు చేసిన ఓ ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌తో పాటు ఆయా దేశాల మాజీ కెప్టెన్లు మైఖెల్ అథర్టన్, అలన్ బోర్డర్, మైఖెల్ బ్రేర్ లీ, గ్రెన్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిందా క్లాక్, డేవిడ్ గ్రోవర్, కిమ్ హ్యూస్, నాజిర్ హుస్సేన్, క్లైవ్ లాయిడ్, స్టీఫెన్ వా, జాన్ రైట్ ఉన్నారు. ‘ఇమ్రాన్ ఖాన్‌ ఆరోగ్య విషయంలో పాక్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో, న్యాయ పూర్వకంగా వ్యవహరించాలి. జైల్లో ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి’ అని వారు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.


పలు కేసుల్లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రావల్పిండిలోని జైలులో ఉన్న ఆయనపై అక్కడి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం. జైలు గదిలో సుదీర్ఘకాలంగా ఒంటరిగా ఉంచడంతో ఆయన కంటి చూపు కోల్పోతున్నారని.. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలిసింది. ఈ పరిణామాలపై స్పందించిన సుప్రీం కోర్టు.. వెంటనే ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోనే 1992లో పాక్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది.


ఇవి కూడా చదవండి:

నేను నఖ్వీని అలా అనలేదు: షోయబ్‌ అక్తర్‌

రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా రికార్డ్

Updated Date - Feb 17 , 2026 | 02:44 PM