Share News

రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా రికార్డ్

ABN , Publish Date - Feb 17 , 2026 | 10:05 AM

అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్ లో అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌(అంతర్జాతీయ టీ20లు, ప్రైవేట్ టీ20 లీగ్స్)లో 700 వికెట్లు పడగొట్టి.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు

రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర..  ప్రపంచంలో తొలి బౌలర్‌గా రికార్డ్
Rashid Khan 700 wickets

స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan) అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈ (UAE)తో జరిగిన మ్యాచ్‌లో అతను ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మరి.. రషీద్ నమోదు చేసిన రికార్డు ఏమిటో ఇప్పుడు చూద్దాం...


నిన్న(సోమవారం) యూఏఈ(UAE)తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ తన స్పెల్ 16వ ఓవర్‌లో యూఏఈ బ్యాటర్ మహమ్మద్ అర్ఫాన్‌ను 'హిట్-వికెట్' రూపంలో అవుట్ చేయడంతో 700వ వికెట్ దక్కింది. దీంతో టీ20 ఫార్మాట్‌(అంతర్జాతీయ టీ20లు, ప్రైవేట్ టీ20 లీగ్స్)లో 700 వికెట్లు(700 wickets) పడగొట్టిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా రషీద్ నిలిచాడు. 2015లో కెరీర్‌ మొదలుపెట్టిన రషీద్ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు 518 మ్యాచ్‌లు ఆడాడు. రషీద్‌ తన టీ20 కెరీర్‌లో 5 వికెట్ల ఘనత నాలుగు సార్లు.. 4 వికెట్ల ఘనత 18 సార్లు నమోదు చేశాడు. రషీద్‌ తన జాతీయ జట్టు ఆఫ్గానిస్థాన్ తో పాటు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడాడు. అలాగే రషీద్‌ భారత్‌, యూఏఈ, ఆస్ట్రేలియా దేశాల్లో 100కు పైగా వికెట్లు తీశాడు. రషీద్‌ ఒక్క ఆసియా ఖండంలోనే 400కు పైగా వికెట్లు తీశాడు. ఈ రెండు ఘనతలు ఎవరి వల్ల సాధ్యం కాలేదు.


2017 నుంచి 2025 వరకు రషీద్‌ ప్రతి ఏడాది కనీసం 50 వికెట్లు తీశాడంటే.. అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక టీ20లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రషీద్‌ తర్వాతి స్థానాల్లో విండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో( Dwayne Bravo)(631), విండీస్‌ మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ (613), దక్షిణాఫ్రికా వెటరన్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ (572), విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (508) ఉన్నారు.


రషీద్‌ తన టీ20 కెరీర్‌లో 432 మంది స్పెషలిస్ట్‌ బ్యాటర్లను ఔట్‌ చేశాడు. టీ20ల్లో ఏ బౌలర్‌ ఇంతమంది స్పెషలిస్ట్‌ బ్యాటర్లను ఔట్‌ చేయలేదు. బౌల్డ్‌ లేదా ఎల్బీడబ్ల్యూ ద్వారా రషీద్‌ 379 వికెట్లు తీశాడు. ఈ ఘనత కూడా కేవలం ఈ ఆఫ్గాన్ స్టార్ మాత్రమే సొంతం. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో విలియం లిల్లీవైట్‌, లిస్ట్‌-ఏ క్రికెట్‌లో వసీం​ అక్రమ్‌, టీ20 ఫార్మాట్‌లో రషీద్‌ ఖాన్‌ 700 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్లుగా రికార్డ్ క్రియేట్ చేశారు.


టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-3 బౌలర్లు వీరే:

  • రషీద్ ఖాన్ (ఆఫ్గానిస్థాన్): 700 వికెట్లు

  • డ్వేన్ బ్రావో (వెస్టిండీస్): 631 వికెట్లు

  • సునీల్ నరైన్ (వెస్టిండీస్): 613 వికెట్లు


ఇవి కూడా చదవండి:

పది పరీక్షలకు దూరమైన యువ హిట్టర్ వైభవ్.. కారణం ఇదే

పాక్ మ్యాచ్‌లో ప్రత్యేక వాచ్‌ ధరించిన హార్దిక్‌.. ధర ఎంతో తెలుసా..?

Updated Date - Feb 17 , 2026 | 10:54 AM