పది పరీక్షలకు దూరమైన యువ హిట్టర్ వైభవ్.. కారణం ఇదే
ABN , Publish Date - Feb 17 , 2026 | 08:40 AM
టీమిండియా అండర్-19 ప్రపంచకప్ స్టార్, రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది జరిగే సీబీఎస్ పదో తరగతి పరీక్షలకు హాజరుకావడం లేదు. అందుకు గల కారణాలను వైభవ్ తండ్రి వెల్లడించారు.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తోన్న యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavamsi).. ఈ ఏడాది జరగనున్న సీబీఎస్ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు. క్రికెట్ శిక్షణ, రాబోయే టోర్నీలపై పూర్తిగా దృష్టిసారించాలనే కారణంతోనే వైభవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైభవ్ బోర్డు ఎగ్జామ్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పాఠశాల యాజమాన్యం ధ్రువీకరించింది. సదరు స్కూల్ డైరెక్టర్ మాట్లాడుతూ..'తండ్రితో చర్చించిన తర్వాతే ఈ పరీక్షలకు దూరమవ్వాలని వైభవ్ నిర్ణయించుకున్నాడు' అని పాఠశాల డైరెక్టర్ ఎ.కె. పింటూ తెలిపారు.
'ప్రస్తుతం వైభవ్ ఫోకస్ అంతా క్రికెట్ పైనే ఉంది. అందుకే ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు వైభవ్ హాజరవడం లేదు. వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడు' అని వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తెలిపారు. బీహార్‌లోని తాజ్‌పూర్‌లో నివసించే వైభవ్.. అక్కడే మోడెస్టరీ పాఠశాలలో చదువుతున్నాడు. పదో తరగతి పరీక్షలకు(CBSE Class 10 exams ) సంబంధించి...ఇప్పటికే వైభవ్ అడ్మిట్ కార్డు జారీ అయింది. అలానే అతనికి పరీక్షా కేంద్రం కూడా నిర్ణయించారు. అయితే, పాఠశాల యాజమాన్యం, అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ మధ్య జరిగిన చర్చల తర్వాత, వైభవ్ ఈ సంవత్సరం పరీక్షలు రాయడం లేదని ధ్రువీకరించారు.
ఇవి కూడా చదవండి:
పాక్ మ్యాచ్‌లో ప్రత్యేక వాచ్ ధరించిన హార్దిక్.. ధర ఎంతో తెలుసా..?