Share News

టీ20 ప్రపంచ కప్2026: కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం

ABN , Publish Date - Feb 17 , 2026 | 02:07 PM

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో ఇవాళ జరిగిన మ్యాచ్ లో కెనడాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెనడా ఇచ్చిన 174 పరుగుల టార్గెట్ ను 15.1 ఓవర్లలోనే న్యూజిలాండ్ అందుకుంది.

టీ20 ప్రపంచ కప్2026: కెనడాపై న్యూజిలాండ్ ఘన విజయం
New Zealand vs Canada

స్పోర్ట్స్ డెస్క్: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో ఇవాళ(మంగళవారం) జరిగిన మ్యాచ్ లో కెనడాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌, కెనడా జట్లు తలపడ్డాయి. తొలుత టాస్‌ గెలిచిన కెనడా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 15.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.


మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన కెనడా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌ యువరాజ్‌ సమ్రా బ్యాట్‌తో(65 బంతుల్లో 110 పరుగులు) రాణించాడు. 58 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో అతి పిన్న వయసులో (19 ఏళ్ల141 రోజులు) టీ20 వరల్డ్‌ కప్‌లో సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్‌ పాకిస్థాన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెహజాద్‌(22 ఏళ్ల 127 రోజులు) పేరిట ఉండేది.


మరో నాలుగు బంతుల్లో ఇన్నింగ్స్‌ ముగుస్తుందనగా యువరాజ్‌.. జాకబ్‌ డఫీ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌నకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్‌ కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వా 36 పరుగులతో రాణించాడు. నవ్‌నీత్‌ ధలీవాల్‌ (10), నికోలస్‌ కిర్టన్‌ (2) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. హర్ష్‌ థాకర్‌ (3*), డిల్లాన్‌ హేలిగర్‌ (8*) నాటౌట్‌గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన కెనడా 173 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ, జాకబ్‌ డఫీ, కేల్‌ జెమీసన్‌, జేమ్స్‌ నీషమ్‌ తలో వికెట్‌ తీసుకున్నారు.


అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్ జట్టు.. 15.1 ఓవర్లలో 176 పరుగులు చేసింది. అయితే ప్రారంభంలో న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కివీస్ స్కోర్ 30 పరుగుల వద్ద ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. టిమ్ సీఫర్ట్(6), ఫిన్ అలెన్(21) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్(76*), రచిన్ రవీంద్ర(59*) జోడీ కెనడా బౌలర్లపై విరుచుకపడ్డారు. వీరిద్దరూ కలిసి 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకున్నారు. ఇక కెనడా బౌలర్లలో డిలాన్ హీలిగర్, సాద్ బిన్ జాఫర్ చెరో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్ విజయంతో న్యూజిలాండ్ జట్టు సూపర్-8కి చేరింది.


ఇవి కూడా చదవండి:

నేను నఖ్వీని అలా అనలేదు: షోయబ్‌ అక్తర్‌

రషీద్ ఖాన్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలో తొలి బౌలర్‌గా రికార్డ్

Updated Date - Feb 17 , 2026 | 03:11 PM