Share News

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన హర్మన్‌ప్రీత్

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:43 PM

మరికొద్ది రోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్ 10లోకి దూసుకొచ్చిన హర్మన్‌ప్రీత్
ICC Women's T20I Rankings

ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది. దీంట్లో పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్ మళ్లీ అంతర్జాతీయ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవల ఐర్లాండ్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌ చివరి మ్యాచ్‌కు వెస్టిండీస్ ప్లేయర్ హీలీ మ్యాథ్యూస్ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె టాప్ ప్లేస్‌ను కోల్పోయింది.


అమెలియా కెర్ 478 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, మ్యాథ్యూస్ 473 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే వీరిద్దరి మధ్య తేడా కేవలం ఐదు పాయింట్లే కావడం గమనార్హం. మరోవైపు స్కాట్లాండ్ ఆల్‌రౌండర్ కేథరిన్ బ్రేస్ ఐర్లాండ్ ట్రై సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా తొమ్మిది స్థానాలు ఎగబాకి 17వ ర్యాంక్‌కు చేరుకుంది.


హర్మన్‌ప్రీత్‌ దూకుడు

భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో అర్ధ శతకం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆమె టాప్ 10లోకి దూసుకొచ్చింది. 655 రేటింగ్ పాయింట్లతో 10వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సోఫీ డివైన్ 650 పాయింట్లతో 11వ స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ జార్జియా వాల్ 815 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ వికెట్ కీపర్ బెత్ మూనీ(788), సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్(786) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత ప్లేయర్లలో స్మృతి మంధాన(740) ఐదో స్థానంలో నిలిచింది.


బౌలర్ల జాబితాలో..

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కూడా పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ ప్లేయర్ లిన్సీ స్మిత్ 727 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మరో ఇంగ్లండ్ ప్లేయర్ లారెన్ బెల్ 723 పాయింట్లతో రెండో స్థానానికి చేరి పాక్ బౌలర్ సాదియా ఇక్బాల్‌తో సమానంగా నిలిచింది. భారత స్పిన్నర్ శ్రీచరణి మాత్రం మూడు స్థానాలు కోల్పోయి ఏడో ర్యాంక్‌కు పడిపోయింది.


ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 09 , 2026 | 07:06 PM