Share News

పాకిస్థాన్‌లోనే ఆడాం.. భారత్‌లో ఆడలేమా?: లిటన్ దాస్

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:31 PM

భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. అయితే నాటి పరిస్థితులపై బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిటన్ దాస్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్‌లోనే ఆడాం.. భారత్‌లో ఆడలేమా?: లిటన్ దాస్
Litton Das

ఇంటర్నెట్ డెస్క్: భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. దానికి బంగ్లా క్రికెట్ బోర్డు భద్రతాపరమైన కారణాలను సాకుగా చూపి భారత్‌లో ఆడబోమని తేల్చి చెప్పింది. ఐసీసీ సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. బంగ్లా క్రికెట్ బోర్డు మొండి వైఖరి ప్రదర్శించింది. అయితే నాటి పరిస్థితులపై బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిటన్ దాస్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బీసీబీ తీసుకున్న నిర్ణయంతో బంగ్లా ప్లేయర్లు ఏకీభవించలేదని వెల్లడించాడు.


‘ఆ నిర్ణయం పూర్తిగా బోర్డు పెద్దలదే. అందులో ప్లేయర్ల పాత్ర లేదు. బోర్డు అధికారులు మాకు భారత్‌లో భద్రత లేదని చెప్పారు. అప్పుడు మేం వారితో.. ‘మేమంతా పాకిస్థాన్‌లో కూడా ఆడాం కదా. అక్కడైతే మా గదుల బయట తుపాకులు పట్టుకుని నిల్చునే వారు. ఇంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితులు ఇంకేముంటాయి. పాక్‌లోనే ఆడినప్పుడు.. భారత్‌లో ఎందుకు ఆడలేం’ అని మేము అధికారులను ప్రశ్నించాం’ అని లిటన్ దాస్ తెలిపాడు. ఆటగాళ్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సమష్టిగా టోర్నీలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయని క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఇంతకుముందు పేర్కొన్నారు. ఈ వాదనను కూడా లిటన్ ఖండించాడు.


అసలు ఏం జరిగిందంటే..

టీ20 ప్రపంచ కప్ 2026కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో నిర్వహించాలని కోరుతూ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో ఆడబోమని స్పష్టం చేసింది. అయితే ఐసీసీ భద్రతా పరిస్థితులను సమీక్షించిన తర్వాత బంగ్లాదేశ్‌కు ఎలాంటి ముప్పు లేదని తేల్చింది. దీంతో మ్యాచ్‌లను తరలించాలన్న బీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. చివరకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఆడాలి.. లేదంటే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేయడంతో బంగ్లాదేశ్ వైదొలిగింది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం లభించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 09 , 2026 | 04:36 PM