ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:04 PM
ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. ఇందులో భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తా చాటారు. అభిషేక్ శర్మ తన స్థానాన్ని పదిలపర్చుకుని అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. కాగా ఇషాన్ కిషన్ రెండో స్థానానికి దూసుకొచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026ను టీమిండియా ఘనంగా ముగించింది. వరుసగా రెండోసారి కప్‌ను ముద్దాడిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. ఇందులో భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తా చాటారు. అభిషేక్ శర్మ తన స్థానాన్ని పదిలపర్చుకుని అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. కాగా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనలు చేసిన ఇషాన్ కిషన్ రెండోస్థానానికి దూసుకొచ్చాడు.
టీ20 ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మ ఆరంభంలో ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి ప్రదర్శనతో టీ20 ర్యాంకింగ్స్‌లో అతడి స్థానాన్ని కోల్పోవచ్చనే చర్చ కూడా జరిగింది. ఎట్టకేలకు ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో అతడి స్థానంలో పదిలం అయింది. 875 పాయింట్లతో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు గత రెండేళ్లు జట్టులోనే లేని ఇషాన్ కిషన్.. దేశవాళీలో సత్తా చాటి తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపించాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 871 పాయింట్లతో రెండోస్థానంలోకి దూసుకొచ్చాడు. 742 పాయింట్లతో తిలక్ వర్మ ఏడో స్థానంలో ఉండగా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(722) తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
బౌలింగ్ విభాగంలో..
ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్థానాన్ని కోల్పోయాడు. పొట్టి ప్రపంచ కప్ టోర్నీలో వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్న సంగతి తెలిసిందే. దీంతో అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 753 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా వరుణ్ చక్రవర్తి 740 పాయింట్లతో రెండోస్థానానికి పడిపోయాడు. స్టార్ పేసర్ బుమ్రా 702 పాయింట్లతో ఆరో స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్ జాబితాలో తొలి స్థానంలో సికందర్ రజా(328), రెండో స్థానంలో హార్దిక్ పాండ్య(299), మూడో స్థానంలో సయామ్ ఆయూబ్(275) ఉన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్(201) తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.
ఇవి కూడా చదవండి:
చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!
డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ