టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్
ABN , Publish Date - Mar 11 , 2026 | 02:26 PM
టీ20 ప్రపంచ కప్‌ను తీసుకుని టీమిండియా ప్లేయర్లు, గంభీర్, జైషా హనుమాన్ ఆలయానికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిని మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ తప్పుబట్టాడు. అతని వ్యాఖ్యలపై గంభీర్ ఘాటుగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా వరుసగా రెండోసారి గెలిచిన విషయం తెలిసిందే. కప్ గెలిచిన తర్వాత భారత క్రికెటర్లు హనుమాన్ ఆలయానికి వెళ్లారు. వారి వెంట ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ ఛైర్మన్ జై షా కూడా వెళ్లారు. అయితే దానిని మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ తప్పు బట్టారు. టీమిండియా సిగ్గు పడాల్సిన విషయం ఇదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీనిపై గంభీర్ ఘాటుగా స్పందించాడు.
‘సమాధానం ఇచ్చేంత విలువ ఈ మాజీ క్రికెటర్ ప్రశ్నకు లేదు. దేశం గర్వపడే క్షణాలు ఇవి. ఇలాంటప్పుడు అసంబద్ధ ప్రశ్నలు వేయడం సమంజసమేనా? మనం వరల్డ్ కప్ విన్నర్లం. సంబరాలు చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఇలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడం వల్ల మనం సాధించిన లక్ష్యాన్ని తక్కువ చేసుకున్నట్లే అవుతుంది. 15 మంది ప్లేయర్లు కష్టపడి సాధించిన దానికి పక్కన పెట్టాలని భావిస్తున్నారా? కుర్రవాళ్లు సాధించిన దానిని వారికి ఇష్టమైన రీతిలో సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఇందులో రాజకీయ, మతపరమైన విభేదాలు చూపించకూడదు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన ప్లేయర్లు.. పుంజుకుని మరీ ఛాంపియన్‌లుగా మారారు. వారి కష్టాన్ని తక్కువ చేయొద్దు. ఇలాంటి వ్యాఖ్యలతో సొంత టీమ్‌నే డీగ్రేడ్ చేసినవారవుతారు’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు.
నేను ఏం చేసినా జట్టు కోసమే..
‘మెగా టోర్నీ సమయంలో మేం తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం సోషల్ మీడియాను అనుమతించపోవడం. బయట జరిగే చర్చలు, విమర్శలు ప్లేయర్ల వరకూ రాకూడదు. ఆటగాళ్లు, జట్టుపై భారీ అంచనాలు ఉంటాయి. అప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మా కుర్రాళ్లను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాం. అదృష్టవశాత్తూ నేను క్రికెట్ ఆడే రోజుల్లో ఇంతటిస్థాయిలో సోషల్ మీడియా లేదు. ఏదైనా విమర్శలు చేయాలంటే ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానే చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాదే ప్రధాన పాత్ర. దాని నుంచి ప్లేయర్లను కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. టీఆర్‌పీల గురించి ప్రయత్నించేవారిని నేను పట్టించుకోను. పొరపాట్లు చేస్తే ధైర్యంగా అంగీకరిస్తా. మున్ముందూ పొరపాట్లు చేస్తా. వాటి నుంచి నేర్చుకుని ముందుకుసాగుతా. కొన్నిసార్లు నేను మంచి నిర్ణయాలు తీసుకుంటా. మరికొన్నిసార్లు బ్యాడ్ డెసిషన్లు కూడా తీసుకుంటా. ఏదైనా సరే జట్టు కోసమే’ అని గంభీర్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!
డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ