ఐపీఎల్‌కు యుద్ధ భయం!
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:40 AM
ఐపీఎల్‌కు మరో మూడు వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఇందుకు పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరో సమస్య కూడా వెంటాడుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న...
న్యూఢిల్లీ: ఐపీఎల్‌కు మరో మూడు వారాల సమయమే ఉన్నా ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఇందుకు పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరో సమస్య కూడా వెంటాడుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం లీగ్‌పై గట్టిగానే పడనుంది. ఎందుకంటే దేశంలో చమురు, గ్యాస్ కొరతకు ఆస్కారం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం పెట్రోలియం, సహజ వాయువుల శాఖ ఎల్పీజీ కొరతపై ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఐపీఎల్ ఫ్రాంచైజీల నగరాలు చెన్నై, బెంగళూరుకు చెందిన హోటళ్లలో రెండు రోజులుగా గ్యాస్ లేక ఇబ్బందిపడుతున్నాయి. దీంతో తమ హోటళ్లను మూసివేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదే లీగ్‌కు ప్రధాన అడ్డంకిగా మారనుంది. ఎందుకంటే గ్యాస్ కొరత ఉన్నప్పుడు ముందు ఆస్పత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇస్తారే కానీ.. క్రికెట్‌కు ఇవ్వడం కుదరదు. ‘పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికైతే ఏమీ చెప్పలేం. కానీ త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ తెలిపాడు. దీనికితోడు ఐపీఎల్ కోసం వివిధ దేశాల నుంచి భారత్‌కు ఆటగాళ్లు రావాల్సి ఉంది. కానీ గల్ఫ్ దేశాల్లో గగనతలాలు మూసివేయడంతో వారంతా ఇక్కడికి రావడం సవాల్‌గా మారింది. ఇప్పటికే సూపర్-8లో ఓడిన దక్షిణాఫ్రికా, విండీస్ ఆటగాళ్లు వారం రోజులుగా భారత్‌లోనే ఇరుక్కుపోయారు. కరీబియన్, ఆఫ్రికాల నుంచి భారత్‌కు నేరుగా విమానాలు లేకపోవడం సవాల్‌గా మారింది. అయితే ఆసీస్, కివీస్ ఆటగాళ్లకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్
కోచ్‌గా హేడెన్
అహ్మదాబాద్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు హేడెన్ నియామకాన్ని టైటాన్స్ మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న పార్థివ్ పటేల్‌తో కలిసి హేడెన్ పనిచేస్తాడని తెలిపింది. ఆశిష్ నెహ్రా టైటాన్స్ చీఫ్ కోచ్‌గా ఉన్నాడు.
రెండు, మూడు
రోజుల్లో షెడ్యూల్..
ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 19వ సీజన్ షెడ్యూల్‌పై అనిశ్చితి కొనసాగుతోంది. గత శనివారమే ఈ వివరాలను ప్రకటిస్తారని అంతా ఎదురుచూసినా వాయిదా పడింది. తాజాగా మరో రెండు, మూడు రోజుల్లో.. అంటే ఈనెల 13లోగా ఐపీఎల్‌కు సంబంధించి మొదటి 20 రోజుల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మంగళవారం వెల్లడించాడు. మిగతా టోర్నీ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామన్నాడు. ఈనెల 28న ప్రారంభం కానున్న ఐపీఎల్.. మే 31న ముగియనుంది. మరోవైపు ఈ లీగ్ సమయంలోనే అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అందుకే ఈసారి పూర్తి షెడ్యూల్‌ను ఒకేసారి ప్రకటించడం కష్టంగా మారింది. కాగా, ఐపీఎల్‌లో పోటీపడుతోన్న జట్లన్నీ ఇప్పటికే సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
చిన్ననాటి స్నేహితురాలితో కుల్‌దీప్ యాదవ్ వివాహం.. ఎప్పుడంటే!
డారిల్ మిచెల్‌తో గొడవ.. అర్ష్‌దీప్ సింగ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ