Share News

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ రెండో స్థానానికి అభిషేక్ శర్మ

ABN , Publish Date - Sep 16 , 2026 | 03:57 PM

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ రెండో స్థానానికి అభిషేక్ శర్మ
Abhishek Sharma

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో అభిషేక్ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు. మరో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్(913) తన అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్నాడు. అయితే టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాలు భారత్‌వే కావడం విశేషం.


అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో అభిషేక్ శర్మ 32 బంతుల్లోనే 82 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఇక రెండో టీ20లోనూ 19 బంతుల్లో 39 పరుగులతో చెలరేగాడు. సుదీర్ఘ కాలం పాటు అగ్రస్థానంలోనే ఉన్న అభిషేక్.. ఫామ్ లేమి కారణంగా మూడో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఫామ్ అందుకోవడంతో రెండో స్థానానికి ఎగబాకాడు. మూడో టీ20లోనూ అదరగొడితే తిరిగి తన టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే, నాలుగో స్థానంలో ఫిల్ సాల్ట్(799), ఐదు, ఆరో స్థానాల్లో బ్రెవిస్(789), పాతుమ్ నిశాంక(751) ఉన్నారు. అఫ్గానిస్థాన్‌తో రెండో టీ20లో హాఫ్ సెంచరీతో చెలరేగిన సంజు శాంసన్‌ తాజా టీ20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని 30వ స్థానానికి చేరుకున్నాడు.


బౌలింగ్ విభాగంలో..

తాజాగా ర్యాంకింగ్స్‌లో టాప్ 4 ప్లేస్‌ల్లో ఎలాంటి మార్పు లేదు. రషీద్ ఖాన్ 744 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(678) ఐదో స్థానానికి దూసుకొచ్చాడు. గాయం కారణంగా ఆటకు దూరమైన జట్టులోకి తిరిగొచ్చిన స్టార్ పేసర్ బుమ్రా టాప్ 10లోకి దూసుకొచ్చాడు. 650 పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్(642) 14వ స్థానానికి ఎగబాకాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో కూడా టాప్ 4 స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు. అఫ్గాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్(246) ఐదో స్థానానికి ఎగబాకాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య(234) ఏడో స్థానానికి పడిపోయాడు.


ఇవి కూడా చదవండి:

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రాకెట్ బద్దలు.. సబలెంకాకు భారీ జరిమానా

తిరగబెట్టిన గాయం.. ఆసియా క్రీడలకూ వరుణ్ చక్రవర్తి దూరం

Updated Date - Sep 16 , 2026 | 03:57 PM