Share News

తిరగబెట్టిన గాయం.. ఆసియా క్రీడలకూ వరుణ్ చక్రవర్తి దూరం

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:27 PM

భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా అఫ్గానిస్థాన్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జపాన్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి జరగనున్న ఆసియా క్రీడలకూ వరుణ్ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తిరగబెట్టిన గాయం.. ఆసియా క్రీడలకూ వరుణ్ చక్రవర్తి దూరం
Varun Chakravarthy

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మళ్లీ గాయపడ్డాడు. దీంతో అఫ్గానిస్థాన్‌తో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. తొలి టీ20లో మూడో ఓవర్ వేస్తుండగా పక్కటెముకలకు గాయం అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జపాన్ వేదికగా సెప్టెంబర్ 28 నుంచి జరగనున్న ఆసియా క్రీడలకూ వరుణ్ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. గాయం కారణంగా రెండు నెలలు ఆటకు దూరంగా అతడు.. ఇటీవలే మైదానంలోకి దిగాడు. ఇప్పుడిప్పుడే ఫామ్ అందుకుంటున్నాడని అభిమానులు సంబరపడుతున్న వేళ.. వరుణ్ మళ్లీ గాయపడటం ఆందోళన కలిగిస్తోంది.


అయితే వరుణ్‌ చక్రవర్తి స్థానంలో ఆసియా గేమ్స్‌ జట్టుకు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఆటగాడిని టీమ్ మేనేజ్‌మెంట్ ప్రకటించలేదు. జట్టులో రవి బిష్ణోయ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ప్రధాన స్పిన్‌ ఆప్షన్లుగా ఉన్నారు. అక్షర్‌ పటేల్‌ కూడా స్పిన్‌ విభాగంలో మరో ప్రత్యామ్నాయంగా ఉన్నాడు. మిస్టరీ బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే వరుణ్.. జట్టులో లేకపోవడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


గాయాలతో సతమతమవుతున్న టీమిండియా

భారత జట్టులో గాయాల బెడద కొనసాగుతోంది. ఇప్పటికే హర్షిత్‌ రాణా అఫ్గానిస్థాన్‌ సిరీస్‌తో పాటు ఆసియా గేమ్స్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో యశ్‌ ఠాకూర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇక జస్ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఇటీవల గాయాల నుంచి కోలుకుని జట్టులోకి వచ్చారు. ఫిట్‌నెస్‌ పరీక్షల్లో క్లియరెన్స్‌ పొందిన అనంతరం వాషింగ్టన్‌, నితీశ్‌ ఆడేందుకు అనుమతి పొందారు. బుమ్రాను రెండు జట్లలోనూ ఎంపిక చేశారు.


సెప్టెంబర్ 17న అఫ్గానిస్థాన్‌తో భారత్ మూడో టీ20 ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌ 22న జపాన్‌తో ప్రతిష్టాత్మక టీ20 మ్యాచ్‌ జరగనుంది. ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్‌ జట్టు సెప్టెంబర్‌ 28న క్వార్టర్‌ ఫైనల్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. సెమీ ఫైనల్స్‌ అక్టోబర్‌ 1న, ఫైనల్‌ అక్టోబర్‌ 3న జరగనున్నాయి.


ఇవీ చదవండి:

ఆటను, అనారోగ్యాన్ని జయించి..

వర్షిణి..ఇక మహిళా జీఎం

Updated Date - Sep 16 , 2026 | 02:38 PM