Share News

అలవోకగా..

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:32 AM

భారత్‌తో జరిగిన రెండో టీ20లోనూ అఫ్ఘానిస్థాన్‌ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకోగా...

అలవోకగా..

భారత్‌దే సిరీస్‌

  • శాంసన్‌ మెరుపు హాఫ్‌ సెంచరీ

  • రెండో టీ20లోనూ అఫ్ఘానిస్థాన్‌ చిత్తు

  • నితీశ్‌కు మూడు వికెట్లు

న్యూఢిల్లీ: భారత్‌తో జరిగిన రెండో టీ20లోనూ అఫ్ఘానిస్థాన్‌ జట్టు ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఓపెనర్‌ సంజూ శాంసన్‌ (22 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 57) మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకోగా.. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్లతో నెగ్గింది. దీంతో మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో సిరీస్‌ దక్కించుకున్నట్టయ్యింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్‌ (37), రషీద్‌ (28), రసూలి (26), నబీ (20) ఫర్వాలేదనిపించారు. నితీశ్‌కు మూడు, అర్ష్‌దీ్‌పనకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 14.5 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. అభిషేక్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39), ఇషాన్‌ (23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్‌) రాణించారు. రషీద్‌కు మూడు వికెట్లు లభించాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నితీశ్‌ నిలిచాడు.

శాంసన్‌ అదిరెన్‌: ఓ మాదిరి ఛేదనలో భారత్‌ ఆరంభం నుంచే కదం తొక్కింది. ఓపెనర్లు శాంసన్‌, అభిషేక్‌లతో పాటు వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ అఫ్ఘాన్‌ బౌలర్లను సునాయాసంగా ఆడేశారు. ఆరంభంలో కాసేపు నిదానంగా ఆడిన శాంసన్‌ అయితే కుదురుకున్నాక ఎదురుదాడికి దిగాడు. స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని యధేచ్ఛగా బౌండరీల వర్షం కురిపించాడు. అటు అభిషేక్‌ తొలి ఓవర్‌లోనే రెండు ఫోర్లతో బ్యాట్‌కు పనిచెప్పాడు. ఐదో ఓవర్‌లో శాంసన్‌ 4,6,4,4తో 20 రన్స్‌ అందించగా.. తర్వాతి ఓవర్‌లోనూ వరుసగా 6,4,4,6తో మరింతగా చెలరేగాడు. దీంతో పవర్‌ప్లేలోనే జట్టు 82 పరుగులు సాధించింది. అయితే ఏడో ఓవర్‌లో స్పిన్నర్‌ రషీద్‌ 17 రన్స్‌ సమర్పించుకున్నా ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చాడు. శాంసన్‌ తన కెరీర్‌లో వేగంగా (20 బంతుల్లో) ఫిఫ్టీని పూర్తి చేశాడు. ఆ తర్వాత కెప్టెన్‌ శ్రేయాస్‌ (11)ను కూడా రషీద్‌ అవుట్‌ చేసినా ఇషాన్‌ సహజశైలిలో ఆడేస్తూ తుదికంటా నిలిచాడు. 14వ ఓవర్‌లో తను 4,6,4 బాదగా, తదుపరి ఓవర్‌లోనే మరో ఫోర్‌తో 31 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


అదే తడబాటు..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ బ్యాటర్లను భారత బౌలర్లు ఈసారీ కట్టడి చేశారు. ఆరంభంలో ఓపెనర్‌ జద్రాన్‌, మిడిలార్డర్‌లో రసూలి.. చివర్లో నబీ, రషీద్‌ పోరాటం కనబర్చడంతో జట్టు గౌరవప్రదమైన స్కోరందుకుంది. బుమ్రా మెయిడిన్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించగా, రెండో ఓవర్‌లో గుర్బాజ్‌ను పేసర్‌ అర్ష్‌దీప్‌ డకౌట్‌ చేశాడు. అయితే జద్రాన్‌, సెడికుల్లా (12) నిలకడ కారణంగా పవర్‌ప్లేలో మరో వికెట్‌ కోల్పోకుండా జట్టు 41 పరుగులు చేయగలిగింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 51 పరుగులు జత చేసింది. నితీశ్‌ వరుస ఓవర్లలో జద్రాన్‌, నయీబ్‌ (10) వికెట్లను తీయడంతో అఫ్ఘాన్‌ తడబాటు ఆరంభమైంది. ఈ దశలో రసూలి క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. ఐదో వికెట్‌కు 29 పరుగులు జత చేశాక ఒమర్జాయ్‌, రసూలి కూడా వరుస ఓవర్లలో వెనుదిరిగారు. 15 ఓవర్లలో 105/6 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును వెటరన్‌ నబీ, రషీద్‌ జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది. బిష్ణోయ్‌ ఓవర్‌లో నబీ 4,6 బాదగా అటు రషీద్‌ సైతం 18వ ఓవర్‌లో 4,4,6తో 16 రన్స్‌ అందించాడు. ఇక ఆఖరి రెండు ఓవర్లలో 17 పరుగులు సాధించిన అఫ్ఘాన్‌ 150+ దాటడంతో పాటు ఈ ఇద్దరి వికెట్లను కూడా కోల్పోయింది.

స్కోరుబోర్డు

అఫ్ఘానిస్థాన్‌: ఇబ్రహీం జద్రాన్‌ (సి) బిష్ణోయ్‌ (బి) నితీశ్‌ 37, గుర్బాజ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) అర్ష్‌దీప్‌ 0, సెడికుల్లా (సి) తిలక్‌ (బి) బిష్ణోయ్‌ 12, నయీబ్‌ (సి) శాంసన్‌ (బి) నితీశ్‌ 10, రసూలి (సి) తిలక్‌ (బి) అర్ష్‌దీప్‌ 26, ఒమర్జాయ్‌ (సి) తిలక్‌ (బి) అక్షర్‌ 11, నబీ (సి) శ్రేయాస్‌ (బి) బుమ్రా 20, రషీద్‌ (సి) అక్షర్‌ (బి) నితీశ్‌ 28, నూర్‌ (నాటౌట్‌) 7, ముజీబుర్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 159/8. వికెట్ల పతనం: 1-0, 2-51, 3-59, 4-67, 5-96, 6-100, 7-148, 8-148; బౌలింగ్‌: బుమ్రా 4-1-25-1, అర్ష్‌దీప్‌ 4-0-35-2, అక్షర్‌ 4-0-28-1, రవి బిష్ణోయ్‌ 4-0-32-1, నితీశ్‌ 3-0-24-3, శివమ్‌ దూబే 1-0-13-0.

భారత్‌: శాంసన్‌ (సి) నబీ (బి) రషీద్‌ 57, అభిషేక్‌ (సి) సెడికుల్లా (బి) రషీద్‌ 39, ఇషాన్‌ (నాటౌట్‌) 38, శ్రేయాస్‌ (సి) జద్రాన్‌ (బి) రషీద్‌ 11, తిలక్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 14.5 ఓవర్లలో 163/3. వికెట్ల పతనం: 1-88, 2-99, 3-123. బౌలింగ్‌: ముజీబుర్‌ 3-0-37-0, నబీ 3-0-44-0, ఒమర్జాయ్‌ 2-0-25-0, రషీద్‌ 3.5-0-36-3, నూర్‌ 2-0-14-0, ఫరూఖి 1-0-6-0.

1

భారత్‌ చేతిలో వరుసగా అత్యధిక టీ20 పరాజయాలు (10) చవిచూసిన జట్టుగా అఫ్ఘానిస్థాన్‌.

Also Read:

అక్టోబర్‌ 3న ‘పాన్-IIT AP సమ్మిట్‌ 2026’: సీఎం చంద్రబాబు

తెలంగాణలో మోస్ట్‌ వాంటెడ్‌ మహిళా మావోయిస్టు లొంగుబాటు

Updated Date - Sep 16 , 2026 | 05:38 AM