Share News

తెలంగాణలో మోస్ట్‌ వాంటెడ్‌ మహిళా మావోయిస్టు లొంగుబాటు

ABN , Publish Date - Sep 15 , 2026 | 06:13 PM

తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ మహిళా అగ్రనేత నక్కా సుశీల అలియాస్‌ రేలా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో మోస్ట్‌ వాంటెడ్‌ మహిళా మావోయిస్టు లొంగుబాటు
Maoist Leader Nakka Sushila Surrender

నిజామాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. తాజాగా మావోయిస్టు నక్కా సుశీల అలియాస్ లత, లలిత, రేలా, జ్యోతి పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం నిజామాబాద్ ఎస్పీ సాయి చైతన్య ఎదుట ఆమె లొంగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్ డివిజన్ కమాండెంట్ మెంబర్ (డీసీఎం)గా ప్రస్తుతం సుశీల బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆమె లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ దాదాపుగా తుడిచి పెట్టుకు పోయిందన్నారు. తెలంగాణకు చెందిన ముగ్గురు అగ్రనేతలు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని ఎస్పీ వివరించారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో సోమవారం ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. నరసరావుపేటలోని అదనపు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సమక్షంలో మావోయిస్టులు కందర్ప దుర్గా ప్రసాద్, గొడ్డళ్ల లచ్చమ్మ లొంగిపోయారు. కందర్ప దుర్గా ప్రసాద్ స్వస్థలం విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం, లచ్చమ్మ స్వస్థలం పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండా అని ఏఎస్పీ ఈ సందర్భంగా వివరించారు. వీరిద్దరు అర్బన్ డెన్ కీపర్లుగా పని చేశారని తెలిపారు.

దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్రం ఆపరేషన్ కగార్ నిర్వహించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లొంగిపోయి.. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కేంద్రం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. అలాగే పలు ఎన్‌కౌంటర్లలో వందలాది మంది మరణించిన సంగతి తెలిసిందే.


Also Read:

అక్టోబర్‌ 3న ‘పాన్-IIT AP సమ్మిట్‌ 2026’: సీఎం చంద్రబాబు

తెలంగాణలో మోస్ట్‌ వాంటెడ్‌ మహిళా మావోయిస్టు లొంగుబాటు

Updated Date - Sep 15 , 2026 | 06:57 PM