యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రాకెట్ బద్దలు.. సబలెంకాకు భారీ జరిమానా
ABN , Publish Date - Sep 16 , 2026 | 03:13 PM
యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో ఓటమిని జీర్ణించుకోలేక స్టార్ ప్లేయర్ అరీనా సబలెంకా ఆగ్రహానికి గురై కోర్టులోనే రాకెట్‌ను విరగ్గొట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రవర్తనపై యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. 7,500 డాలర్ల జరిమానా విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ‘తన కోపమే తనకు శత్రువు’ అంటే ఇదేనేమో! యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో ఓటమిని జీర్ణించుకోలేక స్టార్ ప్లేయర్ అరీనా సబలెంకా ఆగ్రహానికి గురై కోర్టులోనే రాకెట్‌ను విరగ్గొట్టిన సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ కొట్టి సంబరాలు చేసుకోవాలనుకున్న ఆమెకు రిబకినా షాకిచ్చింది. అయితే ఆమె ప్రవర్తనపై యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. 7,500 డాలర్ల జరిమానా విధించింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.7 లక్షలకు పై మాటే. అటు టైటిల్ గెలవలేదని నిరాశలో ఉన్న సబలెంకాకు ఈ ఫైన్ మరో షాకిచ్చింది.
ఫైనల్ మ్యాచ్ తొలి సెట్‌లో బ్రేక్ కోల్పోయిన అనంతరం సబలెంకా తీవ్ర అసహనానికి గురైంది. కోపంతో బంతిని స్టేడియంలో ప్రేక్షకుల వైపు ఎలా పడితే అలా కొట్టడంతో కోడ్ ఉల్లంఘన నమోదైంది. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలోనూ ఆమె ఆగ్రహం చల్లారలేదు. మరోసారి బంతిని కోర్టు వెనుక భాగం వైపు బలంగా కొట్టగా.. అది అక్కడ ఉన్న కెమెరామన్‌కు అత్యంత సమీపంలో నుంచి వెళ్లింది. ఇక మ్యాచ్ ఓడిపోయిన అనంతరం సబలెంకా తన ఆగ్రహాన్ని రాకెట్‌పై చూపించింది. బెంచ్‌పై కూర్చున్న ఆమె రాకెట్‌ను పలుమార్లు నేలకు కొట్టి విరగ్గొట్టింది.
గ్రాండ్‌స్లామ్ టైటిల్ లేకుండానే..
ఫైనల్ వరకు సబలెంకా అద్భుత ప్రదర్శన చేసింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరుకుంది. ఫ్లషింగ్ మెడోస్‌లో వరుసగా 20 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన ఆమె రికార్డుకు కూడా ఫైనల్లో తెరపడింది. అంతేకాకుండా 2026లో సబలెంకా గ్రాండ్‌స్లామ్ టైటిల్ లేకుండానే ముగించాల్సి వచ్చింది. మార్చిలో ఇండియన్ వెల్స్, మియామి ఓపెన్ టైటిళ్లను వరుసగా గెలుచుకుని సన్‌షైన్ డబుల్ సాధించిన సబలెంకా.. ఆ తర్వాత మరో టైటిల్ గెలవలేకపోయింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోనూ రిబకినా చేతిలోనే ఓటమిపాలైన సబలెంకా.. ఇప్పుడు యూఎస్ ఓపెన్ ఫైనల్లోనూ అదే ప్రత్యర్థి చేతిలో పరాజయం చవిచూసింది.
యూఎస్ ఓపెన్ సెమీ ఫైనల్‌లోనే రిబకినా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఫైనల్‌లోనూ గెలవడంతో పాయింట్లు కూడా భారీగా వచ్చాయి. సబలెంకా, రిబకినా మధ్య వ్యత్యాసం దాదాపు 2100 పాయింట్లకు పైనే ఉండటం గమనార్హం. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, రిబకినా 9,901 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా, సబలెంకా 7,875 పాయింట్లతో రెండోస్థానానికి పడిపోయింది. వీరి తర్వాత జెస్సికా పెగులా(7,265), కోకో గాఫ్(7,244), మిర్రా ఆండ్రీవా(5,743) ఉన్నారు.
ఇవీ చదవండి: