Share News

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్.. పాకిస్థాన్ జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ

ABN , Publish Date - May 15 , 2026 | 06:12 PM

పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాయింట్ల కోతతో పాటు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో జరిమానా విధించింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్.. పాకిస్థాన్ జట్టుకు భారీ షాకిచ్చిన ఐసీసీ
Pakistan cricket team

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఐసీసీ భారీ షాకిచ్చింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ నాలుగో సీజన్‌లో పాక్ ఆడింది కేవలం మూడే టెస్టులు. అందులో రెండింట్లో ఓడిపోగా.. ఒకదాంట్లో విజయం సాధించింది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో ఎనిమిదో స్థానంలో ఉంది. తాజాగా ఐసీసీ నిర్ణయంతో పాయింట్ల కోతతో పాటు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో భారీ జరిమానా పడింది.


ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 104 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. 267 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పాక్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ రిఫరీ ఆగ్రహానికి గురైంది. నిర్ణీత సమయానికి ఏకంగా ఎనిమిది ఓవర్లు తక్కువగా వేసిందని ఐసీసీ వెల్లడించింది. దీంతో డబ్ల్యూటీసీలో ఎనిమిది పాయింట్లను కోల్పోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో కేవలం నాలుగు పాయింట్లు ఉన్నాయి. దీంతో పాటు కెప్టెన్ షాన్ మసూద్‌తో పాటు ప్లేయర్లందరికీ ఒక్కొక్కరిపై 40 శాతం మ్యాచ్ ఫీజులో జరిమానా విధించింది. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ నిర్ణయం మేరకు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది.


ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక్కో స్లో ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 5 శాతం, ఒక పాయింట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పాకిస్థాన్ ఏకంగా 8 ఓవర్లు ఆలస్యంగా వేయడంతో భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే, ఐసీసీ డబ్ల్యూటీసీ పట్టికలో ఆస్ట్రేలియా(87.50 శాతం), న్యూజిలాండ్(77.78 శాతం) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. సౌతాఫ్రికా(75), శ్రీలంక(66.67), భారత్(48.15) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 15 , 2026 | 06:12 PM