గౌతమ్ గంభీర్‌పై రాహుల్ ద్రవిడ్ సంచలన కామెంట్స్!
ABN , Publish Date - May 15 , 2026 | 05:16 PM
భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్‌కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని పరోక్షంగా ప్రస్తావించాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం టీమిండియాకు హెడ్‌కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని పరోక్షంగా ప్రస్తావించాడు. అలానే టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై కూడా స్పందించాడు. రవిశాస్త్రి తర్వాత భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా వచ్చిన ద్రవిడ్.. జట్టును విజయపథంలో నిలిపాడు.
స్కూప్ పాడ్‌కాస్ట్‌లో ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘ప్రతీ క్రీడకు హీరోల అవసరం ఉంది. తమ ప్రదర్శనల ద్వారానే ప్లేయర్లు హీరోలుగా మారుతారు. మైదానంలో మన ప్రదర్శన బాగుంటునే ప్రేక్షకులు మనల్ని గుర్తిస్తారు. ముఖ్యంగా భారత్‌లో అద్భుతంగా ఆడితే ఊహించని స్థాయిలో ప్రశంసలు వస్తాయి. ప్రదర్శన సరిగ్గా లేకుంటే విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందరి దృష్టి ఆటగాళ్ల మీదే ఉంటుంది' అని ద్రవిడ్ తెలిపాడు.
'మన ప్రదర్శనలను ప్రేక్షకులు క్షుణ్నంగా గమనిస్తారు. కాబట్టి ఈ దేశంలో ఎంతో గొప్పగా ఆడితే తప్ప సూపర్ స్టార్ అవ్వరు. లేకుంటే దిగ్గజ ప్లేయర్ అనే హోదా రాదు. వ్యక్తిగత ప్రదర్శన బాగుంటే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించినవారము అవుతాము. సూపర్ స్టార్లు భావితరాలకు స్ఫూర్తినిస్తారు. వారి అవసరం తప్పక ఉంది' అని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ సూపర్ స్టార్ ట్యాగులు వద్దంటూ అందరినీ ఒకే గాటన కట్టాలని చూస్తుంటే.. ద్రవిడ్ మాత్రం ఇలా స్పందించడం గమనార్హం.
ద్రవిడ్ మార్గనిర్దేశనంలో భారత్ వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడి ఆధ్వర్యంలోనే టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్ 2026 టైటిల్ గెలిచింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో ద్రవిడ్‌దే కీలక పాత్ర అని, అతడు నిర్మించిన జట్టే టైటిల్ గెలిచిందని అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ ద్రవిడ్‌కు క్రెడిట్ ఇచ్చాడు. మరోవైపు టెస్టు ఫార్మాట్ నుంచి దిగ్గజాలు, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే వైదొలగడంతో గంభీర్‌తో విభేదాలే కారణమనే వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి
తిలక్ వర్మపై అర్ష్‌దీప్ వివాదాస్పద వ్యాఖ్య.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు..