అంపైర్లతో గొడవ.. శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు
ABN , Publish Date - Aug 25 , 2026 | 05:05 PM
శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది. లెవల్ 1 కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు మందలించడం సహా ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక బౌలర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది. లెవల్ 1 కోడ్ ఉల్లంఘనకు పాల్పడినందుకు మందలించడం సహా ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించింది. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ప్రభాత్ జయసూర్య తీవ్ర అసహనానికి గురయ్యాడు. మ్యాచ్ రెండో రోజు చివరి బంతికి ఔటైన అనంతరం అతడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంపైర్ల వైపు బిగ్గరగా చూస్తూ.. బ్యాట్‌తో బౌండరీ లైన్లను బాదాడు. డగౌట్‌లోనూ కోపంగా కనిపించాడు. దీనిపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
మ్యాచ్ రెండో రోజు వెలుతురు సరిగ్గా లేదంటూ జయసూర్య అంపైర్లతో గొడవకు దిగాడు. ఆ తర్వాత మ్యాచ్ చివరి బంతికి ఔటైన అనంతరం పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలో పదే పదే వెనక్కి తిరిగి అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న తర్వాత తన గ్లౌజ్‌లను విసిరేశాడు. పెవిలియన్‌కు తిరిగి వెళ్తున్న సమయంలో బౌండరీ వద్ద ఉన్న వెడ్జ్‌లను తన బ్యాట్‌తో కొట్టాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాలు లేదా ఇతర సామగ్రిని దుర్వినియోగం చేయడాన్ని నిబంధనల ప్రకారం తప్పిదంగా పరిగణిస్తారు. ఈ కారణంగా కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 కింద జయసూర్యపై ఐసీసీ చర్యలు తీసుకుంది.
తొలి తప్పిదం కావడంతో..
జయసూర్య చేసిన తప్పును అంగీకరించాడు. ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన శిక్షను కూడా అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే వ్యవహారం ముగిసింది. గత 24 నెలల్లో జయసూర్య చేసిన తొలి తప్పిదం కావడంతో అధికారిక మందలింపుతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఇదిలా ఉంటే, భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండో మధ్య కూడా వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరిపై ఐసీసీ 25 శాతం మ్యాచ్ ఫీజులో కోతతో పాటు తలో డీమెరిట్ పాయింట్ విధించింది.
ఇవి కూడా చదవండి:
ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు ధోని ఆసక్తి.. నిరాకరించిన సీఎస్కే?
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ కాస్త వెనుకబడింది: రాహుల్ ద్రవిడ్