ప్రపంచ కప్ రిహార్సల్ కాదు.. వైఫల్యాలు దాచిపెట్టడం ఆపేయండి: శ్రీజేష్
ABN , Publish Date - Aug 25 , 2026 | 04:24 PM
హాకీ ప్రపంచ కప్ 2026లో భారత జట్ల పేలవ ప్రదర్శనపై మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్‌ను ప్రయోగాలకు వేదికగా చూడొద్దని.. వైఫల్యాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: హాకీ ప్రపంచ కప్ 2026లో భారత జట్ల పేలవ ప్రదర్శనపై మాజీ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్‌ను ప్రయోగాలకు వేదికగా చూడొద్దని.. వైఫల్యాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశాడు. భారత హాకీ వ్యవస్థను ప్రశ్నిస్తూ ‘ఎక్స్’ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. భారత పురుషుల జట్టు సోమవారం అర్జెంటీనాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 3-5 తేడాతో ఓడి సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. మరోవైపు భారత మహిళల జట్టు కూడా ఆస్ట్రేలియాతో జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను గోల్ లేకుండా డ్రా చేసుకుని సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించిన భారత జట్లలో సభ్యుడైన శ్రీజేష్.. తాజా ప్రదర్శనలపై కఠిన ప్రశ్నలు అడగాల్సిన సమయం వచ్చిందన్నాడు.
‘మనం హాకీ ఆడే జట్టును తయారు చేస్తున్నామా? లేక ప్రపంచంలోని అత్యుత్తమ జట్లను ఓడించగలిగే జట్టును తయారు చేస్తున్నామా? ఇకనైనా వైఫల్యాలను దాచిపెట్టడం ఆపేయండి. ప్రపంచ కప్ ఎలాంటి రిహార్సల్ కాదు. ఈ వైఫల్యాన్ని వచ్చే నెలలో జరిగే ఆసియా క్రీడలతో ముడిపెడుతున్నారు. ప్రపంచ కప్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది?.. ఆసియా క్రీడలు వస్తున్నాయి. అక్కడ పతకం గెలిస్తే.. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ గురించి కలలు కనొచ్చు. ప్రపంచ కప్‌లో జరిగిన ప్రతిదీ కప్పిపుచ్చడానికి అది సరిపోతుందేమో!’ అంటూ శ్రీజేష్ వ్యంగ్యంగా స్పందించాడు.
మహిళల కోచ్‌పైనా విమర్శలు
భారత మహిళల జట్టు చీఫ్ కోచ్ స్జోర్డ్ మారిజ్నె ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలోనే క్యాంప్‌కు దూరంగా వెళ్లినట్లు వచ్చిన వార్తలపైనా శ్రీజేష్ స్పందించాడు. ‘ప్రపంచ కప్‌కు ముందు మహిళల చీఫ్ కోచ్ సెలవులో ఉన్నప్పటికీ అమ్మాయిలు తమ శక్తి మేర పోరాడారు. అంచనాలను మించి రాణించారు. అందుకు వారికి క్రెడిట్ ఇవ్వాలి. కానీ బాధ్యత ఎక్కడ? తుది దశ సన్నాహాల్లో చీఫ్ కోచ్ దూరంగా ఉంటే జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని ఎలా ఆశించగలం?. ఓడిన ప్రతిసారీ ‘ఇది నేర్చుకునే దశ’ అంటూ సమర్థించుకోవడం పద్ధతే కాదు. అత్యుత్తమ జట్లపై ఓడితే ‘లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్’, పాకిస్థాన్ లాంటి జట్టును ఓడిస్తే ‘గొప్ప విజయం’ అని చెప్పడం ఎంతవరకు సమంజసం’ అని శ్రీజేష్ ప్రశ్నించాడు.
ఇవి కూడా చదవండి:
ఫ్రాంచైజీలో వాటా కొనుగోలుకు ధోని ఆసక్తి.. నిరాకరించిన సీఎస్కే?
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ కాస్త వెనుకబడింది: రాహుల్ ద్రవిడ్