పరాజయాలను పతనంగా చూడొద్దు.. భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదు: గంభీర్
ABN , Publish Date - Aug 22 , 2026 | 02:49 PM
భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఇటీవల ఎదురైన పరాజయాలను జట్టు పతనంగా చూడొద్దని తెలిపాడు. ర్యాంకింగ్స్, సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, వ్యూస్ తనకు పట్టవని.. ట్రోఫీలు గెలవడమే తన పని అని గంభీర్ వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత టెస్టు క్రికెట్ గాడి తప్పలేదని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ఇటీవల ఎదురైన పరాజయాలను జట్టు పతనంగా చూడొద్దని తెలిపాడు. ర్యాంకింగ్స్, సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, వ్యూస్ తనకు పట్టవని.. ట్రోఫీలు గెలవడమే తన పని అని గంభీర్ వెల్లడించాడు. భారత్-శ్రీలంక రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబో వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో శనివారం గంభీర్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. టీమిండియా ప్రదర్శనపై వస్తోన్న విమర్శల గురించి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నాకు ర్యాంకింగ్స్ ముఖ్యం కాదు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్, వ్యూస్, విమర్శలతో నాకు పని లేదు. మేం టెస్టుల్లో ఇబ్బంది పడుతున్నామనే వాదనలో అర్థం లేదు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. నా పని ట్రోఫీలు గెలవడం. నేను దాని గురించే ఆలోచిస్తా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో భారత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. జట్టు ఇంకా పరివర్తన దశలోనే ఉంది. కొలంబో టెస్టులో తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు 20 వికెట్లు తీయగల అత్యుత్తమ బౌలింగ్ దళాన్ని బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తాం. కుల్‌దీప్ యాదవ్ మంచి బౌలర్. అయితే కొన్ని సందర్భాల్లో నిర్ణయం కెప్టెన్‌పైనా ఆధారపడి ఉంటుంది. ఒకటి, రెండు మ్యాచ్‌ల ఆధారంగా ఆటగాళ్లపై వేటు వేసేలా నిర్ణయం తీసుకునే ఉద్దేశం లేదు. క్రికెట్‌లో ఎత్తుపల్లాలు సహజం.. యువ ఆటగాళ్లకు తగినంత సమయం ఇచ్చి అండగా నిలవాల్సిన అవసరం ఉంది’ అని గంభీర్ వివరించాడు.
మూడు టెస్టుల సిరీస్ కావాలి!
శ్రీలంకతో ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్ జరుగుతున్నప్పటికీ.. భవిష్యత్తులో మూడు టెస్టుల సిరీస్‌లే మెరుగైనవని గంభీర్ అభిప్రాయపడ్డాడు. ‘మూడు టెస్టుల సిరీస్ అనేది ఆదర్శవంతమైనది. మ్యాచ్‌ల మధ్య తక్కువ సమయం ఉన్నా శరీరాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో మాకు తెలుసు. అవసరమైతే బౌలర్లకు విశ్రాంతి ఇస్తాం. ఒక జట్టు తొలి టెస్టులో ఓడిపోతే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. గాలే పిచ్‌పై సంతృప్తికరంగా అనిపించింది. కొలంబోలోనూ మంచి టెస్టు వికెట్ లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని గంభీర్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
వెనక్కి తగ్గం.. భారత్‌తో మ్యాచ్ ఆడుతాం: బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య
నిప్పులు చెరిగిన స్టార్క్.. 64 పరుగులకే బంగ్లా ఆలౌట్