Share News

వెనక్కి తగ్గం.. భార‌త్‌తో మ్యాచ్ ఆడుతాం: బ్రెజిల్ ఫుట్‌బాల్ సమాఖ్య

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:49 AM

బ్రెజిల్‌తో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను బ‌హిష్క‌రించాల‌ని భార‌త ఫుట్‌బాల్ స్టార్, మాజీ కెప్టెన్ బైఛుంగ్ భూటియా చేసిన వ్యాఖ్యలపై బ్రెజిల్ ఫుట్‌బాల్ స‌మాఖ్య స్పందించింది. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా తాము భారత్‌తో మ్యాచ్ ఆడుతామని స్పష్టం చేసింది.

వెనక్కి తగ్గం.. భార‌త్‌తో మ్యాచ్ ఆడుతాం: బ్రెజిల్  ఫుట్‌బాల్ సమాఖ్య
India vs Brazil friendly

స్పోర్ట్స్ డెస్క్: భారత్ - బ్రెజిల్ జట్ల మధ్య అక్టోబర్ 3న ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను బ‌హిష్క‌రించాల‌ని రెండు రోజుల క్రితం భార‌త ఫుట్‌బాల్ స్టార్, మాజీ కెప్టెన్ బైఛుంగ్ భూటియా సూచించాడు. అతడి వ్యాఖ్యలపై తాజాగా బ్రెజిల్ ఫుట్‌బాల్ స‌మాఖ్య (సీబీఎఫ్‌) స్పందించింది. అక్టోబ‌ర్‌లో భార‌త్‌తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతామ‌ని, తమ ప్ర‌ణాళిక‌ల్లో ఎలాంటి మార్పులు లేవ‌ని బ్రెజిల్ స్ప‌ష్టం చేసింది.


‘అభిమానుల కోసం మేం భారత్‌కు వస్తున్నాం. గత ప్రపంచ కప్‌లో మా జట్టుకు భారతీయులు మద్దతుగా నిలిచారు. అందుకు కృతజ్ఞతగానే ఈ మ్యాచ్‌ను ఆడేందుకు అక్కడికి వస్తున్నాం. అలాగే మంచి ప్రదర్శన ఇవ్వడానికి భారత్‌కు వెళ్లడం సరైన నిర్ణయమేనని భావిస్తున్నాము. బయట నుంచి ఎవరో ఏదో వ్యాఖ్యలు చేసినంత మాత్రాన.. మేము వెనక్కి తగ్గము. బాయ్‌కాట్ పిలుపు వల్ల మేము ప్రభావితం కాలేదు’ అని బ్రెజిల్ జట్టు కోఆర్డినేటర్ రోడ్రిగో వ్యాఖ్యానించారు.


రెండు రోజుల క్రితం కోల్‌క‌తాలోని సాల్ట్‌లేక్ స్టేడియాన్ని బ్రెజిల్ ఫుట్‌బాల్ స‌మాఖ్య ప్ర‌తినిధి బృందం సందర్శించింది. మైదానాన్ని పరిశీలించి నివేదికను తయారు చేసింది. పిచ్‌పై గ‌డ్డి సాంద్ర‌త త‌క్కువ‌గా ఉంద‌ని, దీనివ‌ల్ల ఆట‌గాళ్ల‌కు గాయాల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని ఆ నివేదిక‌లో పేర్కొంది. పిచ్‌పై గ‌డ్డి సాంద్ర‌త‌ను పెంచ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.

Updated Date - Aug 22 , 2026 | 01:01 PM