డైమండ్ లీగ్‌లోనూ రెండో స్థానంలో నీరజ్ చోప్రా
ABN , Publish Date - Aug 22 , 2026 | 09:02 AM
కామన్వెల్త్ క్రీడల్లో రెండో స్థానానికే పరితమైన భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ లోనూ అదే స్థానంలో నిలిచాడు. గ్లాస్గోలో స్వర్ణం చేజిక్కించుకున్న శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగె... ఇక్కడా అగ్రస్థానం సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: లూసానే డైమండ్ లీగ్‌లో భారత్ జావెలిన్ స్టార్, ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. కామన్వెల్త్ క్రీడల్లోనూ రెండో స్థానంలో నిలిచి రజతం గెలిచిన సంగతి తెలిసిందే. గాస్లోలో నీరజ్‌ను వెనక్కి తోసి గోల్డ్ మెడల్ గెలిచి శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగె... ఇక్కడా మొదటి స్థానంలో నిలిచాడు. పతిరగే 88.14 మీటర్లు ఈటెను విసిరాడు. నీరజ్ 88.05 మీటర్లు నమోదు చేశాడు.
2025 జూన్‌లో పారిస్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్‌లో 88.16 మీటర్లు నమోదు చేశాడు. అయితే గతంతో పోలిస్తే నీరజ్ మెరుగైన ప్రదర్శనే కనబరిచాడు. కామన్వెల్త్ క్రీడల 85.83 మీటర్లు నమోదు చేశాడు. రుమేశ్ గత పది టోర్నీల్లో తొమ్మిది సార్లు మొదటి స్థానంలో నిలవడం విశేషం. డైమండ్ లీగ్‌లో జర్మనీకి చెందిన పీటర్స్ అండర్సన్ 86.61 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ 83.71 మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.