Share News

ఫిఫా ప్రపంచ కప్: మెక్సికోపై ఇంగ్లండ్ సంచలన విజయం

ABN , Publish Date - Jul 06 , 2026 | 10:00 AM

ఫిఫా ప్రపంచ కప్ సహ ఆతిథ్య జట్టు మెక్సికోకు ఇంగ్లండ్ షాకిచ్చింది. ప్రిక్వార్టర్స్‌లో పది మందితోనే ఆడిన ఇంగ్లండ్.. మెక్సికోను 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.

ఫిఫా ప్రపంచ కప్: మెక్సికోపై ఇంగ్లండ్ సంచలన విజయం
England vs Mexico

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ సహ ఆతిథ్య జట్టు మెక్సికోకు ఇంగ్లండ్ షాకిచ్చింది. ప్రిక్వార్టర్స్‌లో పది మందితోనే ఆడిన ఇంగ్లండ్.. మెక్సికోను 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. బెల్లింగ్‌హామ్ రెండు గోల్స్‌తో మెరవగా.. హ్యారీ కేన్ పెనాల్టీ గోల్‌తో జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. మెక్సికో టోర్నీ నుంచి నిష్క్రమించింది.


మెక్సికో సిటీలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం ఐదు గోల్స్ నమోదవగా.. ఒక రెడ్ కార్డు, రెండు పెనాల్టీలు, పలు ఎల్లీ కార్డులు మ్యాచ్‌ను మరింత రసవత్తరంగా మార్చాయి. చివరిలో అరగంటకు పైగా ఇంగ్లండ్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆఖరి వరకు అద్భుతంగా పోరాడి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఎస్టాడియో అజ్టెకా స్టేడియం మెక్సికోకు అజేయ కోటగా పేరొందింది. ఈ వేదికపై 89 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు.. కేవలం రెండుసార్లు మాత్రమే ఓడింది. ఆ స్టేడియంలో మెక్సికోను మట్టికరిపించిన మూడో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. అధిక ఎత్తులోని వాతావరణం, అభిమానుల సందడి, వాతావరణం కారణంగా మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి త్రీ లయన్స్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.


బెల్లింగ్‌హామ్ డబుల్

36వ నిమిషంలో డెక్లాన్ రైస్ ప్రారంభించిన గేమ్‌ను బుకాయో సాకా అద్భుతంగా కొనసాగించగా జూడ్ బెల్లింగ్‌హామ్ హెడ్డర్‌తో తొలి గోల్ సాధించాడు. రెండు నిమిషాలకే హ్యారీ కేన్ అందించిన పాస్‌ను మరోసారి గోల్‌గా మలిచి ఇంగ్లండ్‌కు 2-0 ఆధిక్యం అందించాడు. అయితే 42వ నిమిషంలో జులియన్ క్వినోనెస్ గోల్ చేయడంతో మెక్సికో 2-1తో తేడాతో నిలిచింది. 60వ నిమిషంలో ఆంథోనీ గోర్డన్‌పై మెక్సికో గోల్‌ కీపర్ రేంజెల్ ఫౌల్ చేయడంతో ఇంగ్లండ్‌కు పెనాల్టీ లభించింది. దాన్ని హ్యారీ కేన్ గోల్‌గా మలిచి స్కోరును 3-1కు చేర్చాడు.


అయితే ఆ తర్వాత కేన్ చేసిన ఫౌల్‌తో మెక్సికోకు కూడా పెనాల్టీ లభించింది. రౌల్ జిమెనెజ్ దానిని సద్వినియోగం చేసుకోవడంతో స్కోరు 3-2కు వచ్చింది. చివరి నిమిషాల్లో మెక్సికో వరుస దాడులతో ఇంగ్లండ్‌ను ఒత్తిడికి గురిచేసినా.. త్రీ లయన్స్ ప్లేయర్లు పటిష్టంగా నిలిచి విజయం సాధించారు.


ఇవి కూడా చదవండి:

ఇదే నాకు చివరి ప్రపంచ కప్: క్రిస్టియానో రొనాల్డో

ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. నెయ్‌మార్ రిటైర్‌మెంట్

Updated Date - Jul 06 , 2026 | 10:00 AM