Share News

ఇదే నాకు చివరి ప్రపంచ కప్: క్రిస్టియానో రొనాల్డో

ABN , Publish Date - Jul 06 , 2026 | 08:13 AM

రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. ఈ ప్రపంచ కప్ తన కెరీర్‌లో చివరి టోర్నీ అని స్పష్టం చేశాడు. స్పెయిన్‌తో జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌కు ముందు రొనాల్డో మీడియాతో మాట్లాడాడు.

ఇదే నాకు చివరి ప్రపంచ కప్: క్రిస్టియానో రొనాల్డో
Cristiano Ronaldo

ఇంటర్నెట్ డెస్క్: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌పై కొంతకాలంగా ఊహాగానాలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఫిఫా ప్రపంచ కప్ 2026లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. ఇక ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందంటూ అభిమానులు విమర్శలు చేశారు. ఈ క్రమంలో తాజాగా రొనాల్డో తన అంతర్జాతీయ కెరీర్‌పై కీలక ప్రకటన చేశాడు. ఈ ప్రపంచ కప్ తన కెరీర్‌లో చివరి టోర్నీ అని స్పష్టం చేశాడు. స్పెయిన్‌తో జరిగే ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌కు ముందు రొనాల్డో మీడియాతో మాట్లాడాడు. ఈ టోర్నీ తర్వాత ప్రపంచ కప్‌లో ఇక కనిపించబోనని వెల్లడించాడు.


‘ఈ ప్రపంచ కప్‌ను పూర్తిగా ఆస్వాదించాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇదే నా చివరి వరల్డ్ కప్. అయితే రేపు స్పెయిన్‌తో జరగబోయే మ్యాచ్ నా చివరి ప్రపంచ కప్ మ్యాచ్ కాకూడదని ఆశిస్తున్నా’ అని రొనాల్డో వెల్లడించాడు. 41 ఏళ్ల రొనాల్డో ప్రస్తుతం తన కెరీర్‌లో ఆరో ప్రపంచ కప్ ఆడుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే మూడు గోల్స్ నమోదు చేసిన అతడు.. వరల్డ్ కప్ నాకౌట్ దశలో తన తొలి గోల్ కూడా సాధించాడు. మొత్తం ప్రపంచ కప్ చరిత్రలో అతని ఖాతాలో 11 గోల్స్ ఉన్నాయి.


అది నేనే నిర్ణయిస్తా..

తన రిటైర్‌మెంట్‌పై సోషల్ మీడియాలో వస్తోన్న ఊహాగానాలపై కూడా రొనాల్డో స్పందించాడు. ‘జాతీయ జట్టు కోసం ఎప్పుడూ శరీరాన్ని, మనసును అంకితం చేస్తాను. మైదానంలో ఆడినా, ఆడకపోయినా జట్టుకు నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను. నేను ఎప్పుడు రిటైర్ కావాలో నేనే నిర్ణయిస్తాను. ఇతరులు చెప్పినప్పుడు కాదు. ఆ విషయంపై పదే పదే ప్రశ్నించడం అనవసరం. ప్రస్తుతం మా దృష్టి అంతా రేపటి మ్యాచ్‌పైనే ఉంది. ప్రపంచ కప్ గెలవాలనే నమ్మకం లేకపోతే మేము ఇక్కడి వరకు వచ్చే వాళ్లం కాదు. ఈ ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్‌కు మా ఆట మెరుగుపడుతోంది. అన్నిసార్లూ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం అంత సులువు కాదు. ఇప్పటికే ఎన్నో బలమైన జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. మా జట్టు ప్రశాంతంగా ఉంది. సరైన ప్రణాళికతో, పూర్తి సన్నద్ధతతో బరిలోకి దిగుతున్నాం’ అని రొనాల్డో ధీమా వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు

సచిన్ నుంచి వైభవ్ వరకు.. 37 ఏళ్లలో ఎంత మార్పు!

Updated Date - Jul 06 , 2026 | 08:13 AM