Share News

ఏడోసారి.. విజయభేరి

ABN , Publish Date - Jul 06 , 2026 | 02:52 AM

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండానే ఆసీస్‌ విజేతగా నిలిచింది.

ఏడోసారి.. విజయభేరి

ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

టీ20 వరల్డ్‌కప్‌

లండన్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండానే ఆసీస్‌ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా పది ఎడిషన్లలో కంగారూల ఖాతాలో ఇది ఏడో టైటిల్‌ కావడం విశేషం. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన ఏకపక్ష ఫైనల్లో మోలినెక్స్‌ సారథ్యంలోని ఆసీస్‌ ఏడు వికెట్లతో విజయం సాధించింది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఆసీ్‌సతో తలపడిన నాలుగోసారీ ఇంగ్లండ్‌కు పరాజయమే ఎదురవడం గమనార్హం. ముందుగా ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. కెప్టెన్‌ సివర్‌ బ్రంట్‌ (58 నాటౌట్‌), కెంప్‌ (44 నాటౌట్‌), క్యాప్సీ (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 23) రాణించారు. ఛేదనలో ఆసీస్‌ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి నెగ్గింది. బెత్‌ మూనీ (49 బంతుల్లో 10 ఫోర్లతో 64), లిచ్‌ఫీల్డ్‌ (48) అదరగొట్టారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా బెత్‌ మూనీ నిలిచింది.

శతక భాగస్వామ్యంతో..: ఓ మాదిరి ఛేదనలో ఆసీస్‌ టాపార్డర్‌ అదరగొట్టింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ, లిచ్‌ఫీల్డ్‌ జోడీ రెండో వికెట్‌కు ఏకంగా 100 రన్స్‌ జోడించింది. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ వాల్‌ (9) వెనుదిరిగినా ఆసీస్‌ తడబడలేదు. నాలుగో ఓవర్‌లో మూనీ 3 ఫోర్లు, ఐదో ఓవర్‌లో లిచ్‌ఫీల్డ్‌ 4,6తో పవర్‌ప్లేలో జట్టు 62/1 స్కోరుతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. 38 బంతుల్లో మూనీ ఫిఫ్టీ చేయగా, 13వ ఓవర్‌లో లిచ్‌ఫీల్డ్‌ వెనుదిరిగింది. గెలుపునకు 11 రన్స్‌ దూరంలో మూనీ అవుటైనా, 17 బంతులుండగానే పెర్రీ (13 నాటౌట్‌) మ్యాచ్‌ను ముగించింది.

ఆదుకున్న కెప్టెన్‌ సివర్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఆసీస్‌ బౌలర్లు ఇబ్బందిపెట్టారు. దీంతో పరుగుల కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. పవర్‌ప్లేలో 39 పరుగులే చేసిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు జోన్స్‌ (6), డానీ వ్యాట్‌ (8) వికెట్లను కోల్పోయింది. ఈ దశలో సివర్‌ బ్రంట్‌.. క్యాప్సీతో మూడో వికెట్‌కు 35 రన్స్‌ జోడించింది. ఇక, హీథర్‌ నైట్‌ (2) నిరాశపర్చినా.. సివర్‌కు కెంప్‌ అద్భుతంగా సహకరించింది. ఈ జోడీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. కానీ వికెట్‌ కాపాడుకునే క్రమంలో వేగంగా పరుగులు సాధించలేకపోయారు. హాఫ్‌ సెంచరీ చేసిన సివర్‌ చివరి ఓవర్‌లో సిక్సర్‌తో 13 రన్స్‌ రాబట్టడంతో స్కోరు 150కి చేరింది. ఐదో వికెట్‌కు సివర్‌-కెంప్‌ జోడీ అజేయంగా 80 పరుగులు జోడించింది.

Updated Date - Jul 06 , 2026 | 02:52 AM