ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. నెయ్‌మార్ రిటైర్‌మెంట్
ABN , Publish Date - Jul 06 , 2026 | 07:28 AM
బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో నార్వే చేతిలో బ్రెజిల్ అనూహ్యంగా ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026లో నార్వే చేతిలో బ్రెజిల్ అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ మ్యాచ్ అనంతరం నెయ్‌మార్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దీంతో 16 ఏళ్ల ఫుట్‌బాల్ కెరీర్ ముగిసింది.
బ్రెజిల్ తరఫున 129 మ్యాచ్‌లు ఆడిన నెయ్‌మార్ 80 గోల్స్‌తో దేశ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మెట్లైఫ్ స్టేడియంలోనే 2010లో బ్రెజిల్ జెర్సీలో అరంగేట్రం చేసిన నెయ్‌మార్.. అదే వేదికపై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను కూడా ఆడటం విశేషం. నార్వేపై ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన అతడు.. ఇంజూరీ టైమ్‌లో పెనాల్టీని గోల్‌గా మలిచినా బ్రెజిల్ పరాజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే నెయ్‌మార్ భావోద్వేగానికి గురయ్యాడు. మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు ఓదార్చేందుకు ప్రయత్నించినా అతడు తేరుకోలేకపోయాడు.
‘చాలా ప్రయత్నించాను.. కానీ ఇక ముగిసింది. నా ప్రయాణం ఇక్కడే మొదలైంది.. ఇక్కడే ముగిసింది’ అని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ నెయ్‌మార్ భావోద్వేగానికి గురయ్యాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికినప్పటికీ క్లబ్ ఫుట్‌బాల్‌లో మాత్రం కొనసాగనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం బ్రెజిల్ క్లబ్ శాంటోస్ ఎఫ్‌సీ తరఫున ఆడుతున్న అతడు.. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించాడు.
బ్రెజిల్ చెత్త రికార్డు
ప్రపంచ కప్‌లో యూరప్ జట్లపై బ్రెజిల్‌కు నిరాశాజనక రికార్డు కొనసాగుతోంది. 2002 ప్రపంచ కప్ ఫైనల్‌లో జర్మనీని ఓడించి టైటిల్ గెలిచిన తర్వాత యూరోపియన్ ప్రత్యర్థిపై ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నార్వే స్టార్ ఎర్లింగ్ హాలాండ్ రెండు గోల్స్‌తో విజృంభించి తన జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. బ్రెజిల్‌కు లభించిన తొలి పెనాల్టీని బ్రూనో గిమరాయెస్ వృథా చేయగా, చివర్లో నెయ్‌మార్ గోల్ చేసినా ఫలితం లేకపోయింది.
ఇవి కూడా చదవండి:
మహిళల టీ20 ప్రపంచ కప్: స్మృతి మంధానకు ప్రత్యేక గుర్తింపు
సచిన్ నుంచి వైభవ్ వరకు.. 37 ఏళ్లలో ఎంత మార్పు!