Share News

‘వాడీవేడీ’ పోరు ఎంబాపె జోరు

ABN , Publish Date - Jul 06 , 2026 | 02:53 AM

మాటలతో కవ్వించారు.. చేతలతో విసిగించారు.. ఉద్దేశపూర్వకంగా జగడాలకు దిగారు.. ఆట మాటున శారీరకంగా గాయపరిచారు..

‘వాడీవేడీ’ పోరు ఎంబాపె జోరు

ఫిలడెల్ఫియా: మాటలతో కవ్వించారు.. చేతలతో విసిగించారు.. ఉద్దేశపూర్వకంగా జగడాలకు దిగారు.. ఆట మాటున శారీరకంగా గాయపరిచారు.. టక్కుటమార విద్యలన్నీ ప్రదర్శించారు. కానీ, ఈ తరహా పరాగ్వే ఆటకు తన నవ్వే సమాధానం అన్నట్టుగా సాగిన స్టార్‌ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపె.. కూల్‌గా గోల్‌ చేసి ఫ్రాన్స్‌ను క్వార్టర్‌ఫైనల్‌కు చేర్చాడు. ఆదివారం వాడీవేడీగా సాగిన ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రీక్వార్టర్స్‌ పోరులో ఫ్రాన్స్‌ 1-0తో పరాగ్వేపై గెలిచింది. క్వార్టర్‌ఫైనల్‌ సమరంలో మొరాకోతో ఫ్రాన్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. 70వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను ఎంబాపె గోల్‌గా మలచి జట్టుకు విజయాన్నందించాడు. వాస్తవంగా చూస్తే పరాగ్వే జట్టు బాడీ మార్కింగ్‌ నుంచి గట్టెక్కడానికి ఫ్రాన్స్‌ ఒకరకంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది. వ్యూహాత్మకంగా ఆడిన పరాగ్వే.. ఎంబాపె, డెంబెలె లాంటి స్ట్రయుకర్లు స్వేచ్ఛగా కదలకుండా కట్టడి చేసింది. ఈ తరుణంలో ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ బలంగా నిలవడంతో.. పరాగ్వే ఎత్తులు పారలేదు. ఎంబాపె ఛాతీపై కొట్టినా.. వెనుకనుంచి డెంబెలె కాలిపై తొక్కినా.. ఒక్క పరాగ్వే ఆటగాడికి కూడా ఎల్లో కార్డు చూపించలేదంటే వాళ్లు రెఫరీని ఎంతగా ఏమార్చారోనన్న ఆరోపణలు వినిపించాయి. మ్యాచ్‌ 35వ నిమిషంలో ఎంబాపెను అండ్రెస్‌ గట్టిగా పట్టుకోవడంతో.. ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టోర్నీలో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా సాగిన ‘డర్టీ మ్యాచ్‌’ అని కొందరు మాజీలు విమర్శించారు. ఇలాంటి ఆటకు ముందుగానే సన్నద్ధమైనట్టు మ్యాచ్‌ అనంతరం ఎంబాపె వ్యాఖ్యానించాడు.

మెస్సీతో సమంగా..

ప్రపంచక్‌పలో అత్యధిక గోల్స్‌ సాధించిన మెస్సీతో ఎంబాపె పోటీపడుతున్నాడు. మెస్సీ 20 గోల్స్‌తో టాప్‌లో ఉండగా.. ఎంబాపె 19 గోల్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాదు.. ఈ టోర్నీలో మెస్సీతో సమంగా 7 గోల్స్‌ చేసి గోల్డెన్‌ బూట్‌ రేసులో కొనసాగుతున్నాడు.

3.jpg


రెఫరీ నిర్ణయం మార్చుకొని..

మ్యాచ్‌ ఆరంభం నుంచి బంతిపై ఫ్రాన్స్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ, పరాగ్వే మాత్రం భుజబలాన్ని ప్రదర్శిస్తూ ఫ్రాన్స్‌ దాడులను తిప్పికొట్టింది. దీంతో ప్రథమార్ధం గోల్‌ లేకుండానే ముగిసింది. ద్వితీయార్ధం కూడా ఇదే తీరుగా సాగింది. ప్రత్యర్థి ఆటగాళ్లు తమ పెనాల్టీ ఏరియాలోకి వస్తే చాలు పరాగ్వే డిఫెండర్లు మూకుమ్మడిగా చుట్టుముట్టడం.. బలవంతంగా బంతిని చేజిక్కించుకోవడంలాంటి చర్యలకు పాల్పడ్డారు. 65వ నిమిషంలో పరాగ్వే పెనాల్టీ ఏరియాలోకి ఫ్రెంచ్‌ ఆటగాడు డిజైర్‌ డో చొచ్చుకెళ్లగా.. అతడిని పరాగ్వే డిఫెండర్‌ డిగో గోమెజ్‌ మొరటుగా అడ్డుకొని కిందపడేశాడు. అయితే, ఈ చర్యను ఫౌల్‌గా పరిగణించని రెఫరీ ఆటను కొనసాగించాలని సిగ్నల్‌ ఇచ్చాడు. కానీ, వీడియో అసిస్టెంట్‌ రెఫరీ (వీఏఆర్‌) జోక్యంతో రెఫరీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొన్నాడు. ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం ఫ్రాన్స్‌కు పెనాల్టీ కిక్‌ను ఇచ్చాడు. దీన్ని ఎంబాపె గోల్‌గా మలచి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత పరాగ్వే గోల్‌ చేసేందుకు ఉధృతంగా దాడులు చేసినా.. ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ సమర్ధవంతంగా అడ్డుకొంది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత అభినందించడానికి పరాగ్వే కీపర్‌ ఓర్లాండో గిల్‌ చేయిచాస్తే.. ఎంబాపె పట్టించుకోలేదు. దీంతో ఎంబాపెపై ఓర్లాండో బంతిని విసిరి దురుసుగా ప్రవర్తించాడు.

Updated Date - Jul 06 , 2026 | 02:53 AM