Share News

హర్మన్‌ను తప్పించి స్మృతికి కెప్టెన్సీ ఇవ్వాలి: మాజీ స్టార్ క్రికెటర్

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:53 PM

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పించి.. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఆమె అభిప్రాయపడ్డారు.

హర్మన్‌ను తప్పించి స్మృతికి కెప్టెన్సీ ఇవ్వాలి: మాజీ స్టార్ క్రికెటర్
Smriti Mandhana

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ మార్పుపై మాజీ క్రికెటర్ డయానా ఎడుల్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పించి.. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని ఆమె అభిప్రాయపడ్డారు. భవిష్యత్ ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నాయకత్వ మార్పు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు.


‘మనం స్మృతి మంధానను చాలా కాలంగా ఆపుతున్నాం. ఇప్పుడు హర్మన్ ప్రీత్ కౌర్ వయసు 37 ఏళ్లు. తదుపరి వన్డే ప్రపంచకప్‌ వచ్చే సమయానికి హర్మన్ దాదాపు 40 ఏళ్లకు చేరుకుంటుంది. కాబట్టి స్వయంగా హర్మన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలి. స్మృతికి కెప్టెన్సీని అప్పగించాలి. ఇద్దరు యువ క్రికెటర్లను వైస్‌ కెప్టెన్లుగా పరిశీలించాలి. హర్మన్‌కు నా వినమ్ర విజ్ఞప్తి ఒక్కటే.. ఇంకా ఎందుకు కెప్టెన్‌గా ఉన్నావనే ప్రశ్న మాత్రం ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకోవద్దు?’ అని డయానా ఎడుల్జీ వెల్లడించారు.


పవర్‌ గేమ్‌లో స్మృతి దూకుడు

మరోవైపు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కూడా స్మృతి మంధాన బ్యాటింగ్‌లో వచ్చిన మార్పులపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా పవర్‌ గేమ్‌ను స్మృతి గణనీయంగా మెరుగుపర్చుకుందని తెలిపారు. ‘రెండేళ్లుగా స్మృతి తన పవర్‌ గేమ్‌పై ఎంతగా పని చేసిందో చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆమె ఎంతో సులభంగా బంతిని బౌండరీ దాటిస్తోంది. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయం. ప్లేయర్లు తమను తాము మెరుగుపర్చుకోవాల్సిన అవసరం గురించి గతంలో చాలా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మిడిలార్డర్‌లో ఆడే ఆటగాళ్లు లేదా జట్టులోకి కొత్తగా వస్తున్న యువ క్రికెటర్లు స్మృతిని ఉదాహరణగా తీసుకోవచ్చు. రెండేళ్ల క్రితం స్మృతి టీ20, వన్డే క్రికెట్ ఎలా ఆడింది? ఇప్పుడు టీ20ల్లో ఎలా ఆడుతోంది? ముఖ్యంగా స్పిన్నర్లపై ఆమె చూపిస్తున్న ఆధిపత్యం అద్భుతం’ అని అంజుమ్ చోప్రా వివరించారు.


ఇవి కూడా చదవండి:

వయసుతో సంబంధం లేదు.. వైభవ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే: గంభీర్

ఆసియా గేమ్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

Updated Date - Sep 18 , 2026 | 04:53 PM