Share News

అఫ్గానిస్థాన్‌పై ఎలాంటి వివక్ష చూపించలేదు: ఢిల్లీ క్రికెట్ బోర్డు

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:03 PM

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వడం గొప్ప అనుభవమని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) డైరెక్టర్ శ్యామ్ సుందర్ అన్నారు.

అఫ్గానిస్థాన్‌పై ఎలాంటి వివక్ష చూపించలేదు: ఢిల్లీ క్రికెట్ బోర్డు
Delhi Cricket Board

ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వడం గొప్ప అనుభవమని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) డైరెక్టర్ శ్యామ్ సుందర్ అన్నారు. స్టేడియంలోని సౌకర్యాలు, పిచ్‌పై అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆ జట్టు సభ్యులు ప్రశంసలు కురిపించారని తెలిపారు. అఫ్గాన్ జట్టు అయినా.. ఢిల్లీ ప్రేక్షకులు ఎలాంటి వివక్ష చూపకుండా ఇరు జట్ల ఆటగాళ్లను సమానంగా ప్రోత్సహించారని పేర్కొన్నారు.


‘మొదటిసారి మా సొంత స్టేడియంలో సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చాం. ఇది మాకు ఎంతో గొప్ప అనుభవం. అద్భుతమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నించాం. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆ జట్టు సభ్యులు మా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిచ్‌ను వారు ప్రశంసించడం ఎంతో ఆనందంగా అనిపించింది. అఫ్గాన్ అభిమానులే కాదు.. ఢిల్లీ ప్రేక్షకులు కూడా ఆటను ఆస్వాదించారు. విదేశీ జట్టు విషయంలో ఎలాంటి వివక్ష కనిపించలేదు. స్టేడియంలో అద్భుతమైన వాతావరణం నెలకొంది. అఫ్గానిస్థాన్ చాలా మంచి జట్టు. అఫ్గానిస్థాన్ క్రికెట్‌ను ప్రోత్సహించాలన్నది ఐసీసీ ఛైర్మన్ జై షా విజన్. అసోసియేట్ దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి’ అని శ్యామ్ సుందర్ తెలిపారు.


దేశానికి గర్వకారణం..

భారత్ 3-0తో సిరీస్‌ను గెలవడంపై DDCA కార్యదర్శి అశోక్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో వరుసగా రెండు సిరీస్‌లలో ఓటములు ఎదురైన నేపథ్యంలో ఈ విజయం దేశవ్యాప్తంగా ఆనందాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ‘భారత్ సిరీస్ గెలవడం ఎంతో ఆనందంగా ఉంది. గత రెండు సిరీస్‌ల్లో ఓడిపోయిన తర్వాత ఈ విజయం దేశ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది. DDCA ఆతిథ్యంలో సిరీస్ విజయవంతంగా జరిగింది. అఫ్గానిస్థాన్ మేనేజ్‌మెంట్ భారత్‌లోని ‘అతిథి దేవో భవ’ స్ఫూర్తిని తమ దేశానికి తీసుకెళ్లి అక్కడి వారికి చెబుతుందని ఆశిస్తున్నాం. అఫ్గాన్ జట్టు మళ్లీ ఢిల్లీకి రావాలని కోరుకుంటున్నాం. వారికి బీసీసీఐ ద్వారా డీడీసీఏ ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని అశోక్ శర్మ అన్నారు.


ఇవి కూడా చదవండి:

వయసుతో సంబంధం లేదు.. వైభవ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే: గంభీర్

ఆసియా గేమ్స్: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత మహిళా జట్టు

Updated Date - Sep 18 , 2026 | 04:03 PM