ప్రపంచ రికార్డు.. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా దీప్తి శర్మ
ABN , Publish Date - Aug 31 , 2026 | 06:53 AM
భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది. ఆదివారం థాయ్‌లాండ్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో దీప్తి ఈ అరుదైన మైలురాయిని అందుకుంది.
థాయ్‌లాండ్‌పై 1.1 ఓవర్లు వేసిన దీప్తి.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టింది. దీంతో ఆమె టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన వికెట్ల సంఖ్యను 171కి పెంచుకుంది. ఇప్పటివరకు ఈ రికార్డు థాయ్‌లాండ్ బౌలర్ తిపచ్చా పుత్తావాంగ్ (170) పేరిట ఉండగా.. తాజాగా దీప్తి దాన్ని అధిగమించింది.
మరో రికార్డు..
థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ దీప్తికి భారత్ తరఫున 150వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కావడం మరో విశేషం. దీంతో 150కిపైగా టీ20లు ఆడిన భారత మహిళా క్రికెటర్ల జాబితాలో హర్మన్‌ప్రీత్ కౌర్ (203), స్మృతి మంధాన (172) తర్వాత దీప్తి మూడో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 150 లేదా అంతకంటే ఎక్కువ టీ20లు ఆడిన మహిళా క్రికెటర్లలో దీప్తి 12వ స్థానంలో ఉంది.
గర్వంగా ఉంది..
మ్యాచ్ అనంతరం దీప్తి తాను సాధించిన రికార్డుపై మాట్లాడింది. ‘150 వికెట్ల కంటే ఎక్కువ సాధించడం గర్వంగా ఉంది. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ భారత జెర్సీని ధరించడం ఎంతో గర్వకారణం. భారత ప్లేయర్‌గా చేయాల్సిన పనులను సరిగ్గా చేయడంపైనే నా దృష్టి ఉంటుంది. ప్రత్యర్థి జట్టులో ఎవరున్నారు అనే విషయంపై నేను ఆలోచించను. నా బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవడం, బౌలింగ్ యూనిట్‌కు సహకరించడంపైనే దృష్టి పెడతాను’ అని దీప్తి పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో టీమిండియా దిగ్గజం
కెప్టెన్‌గా తొలి డీఆర్ఎస్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ..