రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్! జైలా..ఫైనా?
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:56 AM
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇ–సిగరెట్ తాగుతూ టీవీ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్‌గా ఉందని సమాచారం.
స్పోర్ట్స్ డెస్క్: పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 28న జరిగిన మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. అతడు డ్రెసింగ్ రూమ్‌లో ఇ- సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్‌గా ఉందని సమాచారం.
'వేపింగ్ చట్టరీత్యా నేరం. కాబట్టి ఈ విషయంపై మేము రియాన్ నుంచి వివరణ కోరతాం. అతడి సమాధానం ఆధారంగా ఐపీఎల్ కమిటీ తదుపరి చర్యలు తీసుకుంటుందని' బీసీసీఐలోని అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ఇదే విషయంపై ఐపీఎల్ అధికారి కూడా ఒకరు స్పందించారు. చాలా మంది ఆటగాళ్లు ఇ–సిగరెట్‌లు వాడతారని, ఎన్నో కెమెరాలు తమ వైపు చూస్తుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలా ఎవరూ చేయరని అన్నారు. ఇంత బహిరంగంగా పట్టుబడటం పరాగ్ నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుందని, బీసీసీఐ కచ్చితంగా అతనిపై చర్య తీసుకుంటుందని సదరు అధికారి వెల్లడించారు.
రియాన్ పరాగ్ ను మద్దతుగా మరో అధికారి మాట్లాడారు. డ్రెస్సింగ్ రూమ్ క్రికెటర్ల ప్రైవేట్ ప్రదేశమని, అక్కడ ఆటగాళ్లు తమకు నచ్చినట్లుగా ఉంటారని తెలిపారు. అయితే అక్కడి దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డు చేయడం సరైంది కాదని, ఇది క్రికెటర్ల గోప్యతకు భంగం కలిగిస్తుందని అన్నారు. కెమెరామెన్లు మైదానంలో ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని బోర్డులోని మరో అధికారి అభిప్రాయపడ్డారు.
భారత ప్రభుత్వం 2019లో ఇ-సిగరెట్ల ఉత్పత్తి, అమ్మకం, పంపిణీని నిషేధించింది. చట్టం ప్రకారం.. మొదటిసారి నేరం చేసిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా రూ.1 లక్ష జరిమానా విధించబడుతుంది. ఒకవేళ విచారణలో పరాగ్ తప్పు చేసినట్లే తేలితే బీసీసీఐ ఒకట్రెండు మ్యాచ్‌లు నిషేధం విధించే అవకాశముందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
అతడి వల్లే మ్యాచ్ గెలిచాం: ప్యాట్ కమిన్స్
నల్ల బ్యాండ్లు ధరించిన ముంబై ఆటగాళ్లు.. ఎందుకంటే?