Share News

నల్ల బ్యాండ్లు ధరించిన ముంబై ఆటగాళ్లు.. ఎందుకంటే?

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:49 AM

ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో ఏప్రిల్‌ 29న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు.

నల్ల బ్యాండ్లు ధరించిన ముంబై ఆటగాళ్లు.. ఎందుకంటే?
Mumbai Indians tribute

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో నిన్న (బుధవారం) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ హృదయ విదారక కారణం ఉంది. ముంబై జట్టు సహాయ సిబ్బందిలోని ఒకరి కుమార్తె ఇటీవల మరణించింది. ఆమెకు నివాళులర్పిస్తూ, అలాగే ఆ కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ముంబై ఆటగాళ్లు నల్ల బ్యాండ్లను చేతికి ధరించి మైదానంలోకి దిగారు.


ఈ విషయంపై ముంబై ఫ్రాంచైజీకీ చెందిన ఓ అధికారి కీలక విషయాలను వెల్లడించాడు. 'మా సహాయక సిబ్బందిలో ఒకరి కుమార్తె అకాల మరణం చెందింది. వారి కుటుంబానికి మద్దతుగా, ఆమెకు గుర్తుగా హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మా ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించారు' అని వెల్లడించారు. ఆ కుటుంబ గోప్యతను గౌరవిస్తూ, సంబంధిత సిబ్బంది వివరాలను ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ వెల్లడించలేదు.


ఇక ముంబై ప్లేయర్లు చేసిన పనికి క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు గ్రేట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ్యాచ్ ఓడినా.. ఇలాంటి పని చేసి.. ప్రేక్షకుల మనసులు గెలిచారంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(76), హెన్రీచ్ క్లాసెన్( 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.


ఇవి కూడా చదవండి:

ఆ రెండు తప్పిదాలే మా ఓటమికి కారణం: హార్దిక్ పాండ్య

ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిన రికెల్టన్‌

Updated Date - Apr 30 , 2026 | 08:49 AM