Share News

డీజే దెబ్బకు 140 కోళ్ల మృతి.. పోలీసులను ఆశ్రయించిన యజమాని..

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:03 AM

డీజే కారణంగా తన కోళ్ల ఫామ్‌లోని 140 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయని ఫామ్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. డీజే ఆపరేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది.

డీజే దెబ్బకు 140 కోళ్ల మృతి.. పోలీసులను ఆశ్రయించిన యజమాని..
Uttar Pradesh news

లక్నో, ఏప్రిల్ 30: డీజే కారణంగా తన కోళ్ల ఫామ్‌లోని 140 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయని ఫామ్ యజమాని పోలీసులను ఆశ్రయించాడు. డీజే ఆపరేటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బుధవారం సుల్తాన్‌పూర్ జిల్లాలోని రామ్ భద్ర పూర్వ గ్రామానికి చెందిన బద్దన్ విశ్వకర్మ కూతురి పెళ్లి జరిగింది. మంగళవారం రాత్రి పెళ్లి కూతురి తరఫు వారు డీజేతో పెళ్లి జరిగే గ్రామానికి వెళ్లారు. సబీర్ అలీ అనే వ్యక్తి ఊరి బయట కోళ్ల ఫామ్ నడుపుతున్నాడు.


9.30 గంటల ప్రాంతంలో పెళ్లి జనం డీజేతో ఫామ్ ముందు నుంచి వెళ్లారు. డీజే శబ్దం కారణంగా ఫామ్‌లోని కోళ్లు భయాందోళనకు గురయ్యాయి. గట్టిగా అరుస్తూ.. అటు, ఇటు పరుగులు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం దెబ్బతిని 140 కోళ్లు చనిపోయాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సబీర్ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పార్సీపూర్‌కు చెందిన డీజే ఆపరేటర్ కవి యాదవ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ..


‘సంఘటన జరిగిన సమయంలో డీజే ఆపరేటర్ పర్మిషన్ ఇచ్చిన సౌండ్ లిమిట్ కంటే ఎక్కువ మొత్తంలో సౌండ్ పెట్టాడా? అన్న కోణంలో ఆరా తీస్తున్నాము. శబ్దం కారణంగా కోళ్లు చనిపోయే అవకాశం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము’ అని తెలిపారు. పెద్ద మొత్తంలో శబ్దం కారణంగా వచ్చే శబ్ద తరంగాల వల్ల పక్షులు, జంతువుల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని, అవి కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యే అవకాశం ఉంటుందని జూలాజిస్ట్‌లు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి

ప్రపంచ స్థాయి వ్యాపార కేంద్రంగా హైదరాబాద్‌

ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిన రికెల్టన్‌

Updated Date - Apr 30 , 2026 | 09:10 AM