కోహ్లీ కోపం వెనుక దురుద్దేశం ఉండదు: మాజీ అంపైర్ అనిల్ చౌదరి
ABN , Publish Date - Aug 03 , 2026 | 09:12 PM
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మైదానంలో చూపించే ఆవేశం వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండవని తెలిపారు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మైదానంలో చూపించే ఆవేశం వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండవని మాజీ అంతర్జాతీయ అంపైర్ అనిల్ చౌదరి స్పష్టం చేశారు. జియోహాట్‌స్టార్ టాక్ షోలో పాల్గొన్న ఆయన, కోహ్లీ లాంటి ఎనర్జెటిక్ ప్లేయర్లు ఉన్నప్పుడే క్రికెట్‌కు అసలైన మజా వస్తుందని పేర్కొన్నారు.
'చిన్నప్పటి నుంచి విరాట్‌కు అంపైరింగ్ చేయడం వల్ల అతని మనస్తత్వం నాకు తెలుసు. కొన్నిసార్లు మైదానంలో చాలా తీవ్రంగా స్పందించినప్పటికీ, మనం సరైన నిర్ణయం ఇస్తే వెంటనే 'థంబ్స్ అప్' చూపిస్తాడు. ఓవర్ల మధ్యలో మా దగ్గరకు వచ్చి ఎంతో ఆప్యాయంగా మాట్లాడతాడు. విరాట్ లాంటి క్రీడాకారులు లేకపోతే క్రికెట్ మ్యాచ్‌లు ఎంతో బోరింగ్‌గా మారుతాయి' అని అనిల్ చౌదరి వివరించారు. ఉత్తరాది ఆటగాళ్ల రక్తంలోనే పోటీతత్వం, వేడి ఉంటాయని, అది హద్దులు దాటనంత వరకు ఆటకి అందాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు మైదానంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో బ్యాటర్లు ముందే క్రీజ్ దాటడంపై స్పందిస్తూ.. రాబోయే ఒకటి లేదా రెండేళ్లలో ఐసీసీ (ICC) కీలక మార్పులు తీసుకువస్తుందని చౌదరి అన్నారు. వరుసగా తప్పులు చేస్తే పరుగుల జరిమానా (Run Penalty) విధించే అవకాశాలు ఉన్నాయని అనిల్ జోస్యం చెప్పారు. అలాగే సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఒత్తిడి సమయాల్లో అంపైర్లను ఇబ్బంది పెట్టడానికి బౌలర్లు చమత్కారంగా 'కళ్లద్దాలు పెట్టుకోవచ్చు కదా సార్.. ఏమైనా మంచు కప్పేసిందా?' అని కామెంట్లు చేస్తూ ఆటలో వినోదాన్ని నింపుతారని వెల్లడించారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.. మాజీ అంపైర్ స్టీవ్ బక్నర్‌తో వీరేందర్ సెహ్వాగ్ చేసిన సరదా వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. సచిన్ టెండూల్కర్‌కు బక్నర్ తప్పుడు నిర్ణయాలు ఇస్తుండటంతో ఆగ్రహించిన సెహ్వాగ్.. 'స్టీవ్.. నీ వయస్సు ఎంత? అని అడిగారు.52 లేదా 53 ఏళ్లు ఉంటాయని స్టీవ్ సమాధానం చెప్పాడు. వెంటనే స్పందించిన సెహ్వాగ్.. నీకు కళ్ళు సరిగ్గా కనిపించవు, చెవులు వినిపించవు, వెంటనే రిటైర్ అయిపోవచ్చు కదా' అని నేరుగానే అన్నట్లు చోప్రా వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్
టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ