Share News

గంజాయి విక్రేతల వివరాలు నేనిస్తా.. అరెస్టు చేయండి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ABN , Publish Date - Aug 03 , 2026 | 07:52 PM

రాష్ట్రంలో గంజాయి నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం 'సంకల్పం 2.0' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సోమవారం అనకపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

గంజాయి విక్రేతల వివరాలు నేనిస్తా.. అరెస్టు చేయండి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Ayyannapatrudu

అనకాపల్లి, ఆగస్టు 03: రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన 'సంకల్పం 2.0' కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి మూలాలను మట్టుబెట్టడంలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు.


విశాఖపట్నం పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల హాస్టళ్లలో రాత్రి వేళల్లో విద్యార్థులు గంజాయి తాగుతున్నారనే విషయాలు తనిఖీల్లో వెల్లడవుతుండటం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు గంజాయి బారిన పడితే వారి భవిష్యత్తు ఏమవుతుందో, వారి కుటుంబాల పరిస్థితి ఏంటో ఆలోచించాలని కోరారు. 'మనందరికీ పిల్లలు ఉన్నారు.. వారి భవిష్యత్తు రక్షణ కోసం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే ఎవ్వరూ ఏమీ చేయలేరు' అని పేర్కొన్నారు.


గంజాయి సరఫరాదారుల సమాచారం కావాలంటే తానే స్వయంగా ఇస్తానని, దమ్ముంటే వారిని అరెస్టు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారి పేర్లను తానిస్తానని.. వారిని అండమాన్ జైలుకు తరలించి కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు తక్షణమే చేపట్టాలని పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై ఏపీ అసెంబ్లీ బులెటిన్ విడుదల..

Updated Date - Aug 03 , 2026 | 08:35 PM