Share News

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్

ABN , Publish Date - Aug 03 , 2026 | 07:04 PM

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత జావెలైన్ త్రోయర్ యశ్‌వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ చరిత్రాత్మక విజయం వెనుక ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఇచ్చిన సలహానే కారణమని యశ్‌వీర్ వెల్లడించాడు.

నీరజ్ చోప్రా సలహాతోనే మెడల్ వరించింది: కాంస్య విజేత యశ్‌వీర్ సింగ్
Yashvir Singh

స్పోర్ట్స్ డెస్క్: గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో భారత జావెలైన్ త్రోయర్ యశ్‌వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ చరిత్రాత్మక విజయం వెనుక ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా చివరి క్షణంలో ఇచ్చిన చిన్న సలహానే కారణమని యశ్‌వీర్ వెల్లడించాడు. టోర్నీ ముగించుకుని ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.


ఈ నేపథ్యంలో యశ్‌వీర్ మీడియాతో మాట్లాడుతూ.. 'నా ఆఖరి త్రోకు ముందు నీరజ్ భాయ్ నన్ను ఎంతో ప్రోత్సహించాడు. జావెలైన్‌ను వేసేటప్పుడు దానిని వన్ లైన్‌లోనే ఉంచమని చెప్పాడు. ఆయన ఇచ్చిన సలహాను పాటిస్తూ నా అత్యుత్తమ ప్రదర్శన 85.41 మీటర్ల దూరానికి ఈటెను విసిరి మూడో స్థానంతో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాను' అని యశ్‌వీర్ ఆనందం వ్యక్తం చేశాడు. పోటీలోని చివరి రౌండ్‌కు ముందు యశ్‌వీర్ 81.33 మీటర్ల త్రోతో ఏడో స్థానంలో ఉన్నాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ 82.88 మీటర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక చివర్లో నీరజ్ ఇచ్చిన సలహాను అమలు చేసి.. యశ్‌వీర్ కాంస్య పతకాన్ని ముద్దాడాడు.


‘వన్ లైన్’ అంటే ఏమిటి:

జావెలైన్ విసిరేటప్పుడు ఈటెను చెవికి దగ్గరగా ఉంచి, భుజాలను కదిలించే దిశలోనే ఒకే సరళరేఖలో నిలబెట్టడం ద్వారా ఎక్కువ దూరం విసిరేందుకు బలం చేకూరుతుంది. అంతేకాకుండా భుజంపై పడే ఒత్తిడి కూడా తగ్గుతుంది. నీరజ్ ఇచ్చిన ఈ సూచనతో యశ్‌వీర్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ త్రోను నమోదు చేసి, పతకంతో మెరిశాడు. తన జీవితంలోనే అతిపెద్ద టోర్నమెంట్‌లో పతకం సాధించడం పట్ల యశ్‌వీర్ హర్షం వ్యక్తం చేశాడు.


ఇవి కూడా చదవండి:

సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అలాంటి భాగస్వామిపై క్రిమినల్ కేసులు..

టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ

Updated Date - Aug 03 , 2026 | 07:39 PM