Share News

న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం.. ఎంపీ రఘునందన్ ఏం చెప్పారంటే..

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:05 PM

లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు-2026 ఆమోదం పొందడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో దాదాపు లక్ష పెండింగ్ కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరిచేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం.. ఎంపీ రఘునందన్ ఏం చెప్పారంటే..
MP Raghunandan Rao

ఢిల్లీ: లోక్‌సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు-2026 ఆమోదం పొందడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో దాదాపు లక్ష పెండింగ్ కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్క సంవత్సరంలో 65 వేల కేసులను డిస్పోజ్ చేస్తే.. 75 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని ఈ సందర్భంగా ఎంపీ తెలిపారు. దీంతో కేసుల విచారణను వేగవంతం చేయాలనే లక్ష్యంతోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.


జడ్జిల సంఖ్య పెంపుతో కక్షిదారులకు ఇబ్బందులు కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2019లో ఒకసారి, ఇప్పుడు మరోసారి జడ్జిల సంఖ్య పెంచారని తెలిపారు. దేశ ప్రజలకు వేగంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లులను కేంద్రం తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కేంద్రం రూ.7 వేల కోట్లు ఖర్చు చేసిందని ప్రశంసించారు. కొలిజియం విధానానికి వ్యతిరేకంగా సర్వీస్ కమిషన్ తీసుకురావాలని గతంలో ప్రయత్నం జరిగిందని, అయితే సుప్రీంకోర్టు దానిని కొట్టివేసిందని రఘునందన్ రావు గుర్తు చేశారు. కొలిజియంలో మరింత పారదర్శకత అవసరమని, అందుకోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.


జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజల అభిప్రాయంగా తాను భావిస్తున్నానని, వాటిని స్వాగతిస్తున్నట్లు రఘునందర్ రావు పేర్కొన్నారు. ఆయన అభిప్రాయానికి అనుగుణంగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు E-20 పెట్రోల్‌ అంశంపైనా ఎంపీ స్పందించారు. E-20తో లాభాలు ఉన్నాయని చెప్పిన ఆయన.. త్వరలోనే అపోహలపై స్పష్టత ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. యూఏఈకి చెందిన ఓ కంపెనీతో త్వరలోనే భారత్‌లో కార్యక్రమం నిర్వహించి అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం..

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో వెయ్యి రొబోటిక్ శస్త్రచికిత్సలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Aug 03 , 2026 | 06:12 PM